ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్న కుమారుడి సమాది వద్దే తండ్రి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. రోజుల వ్యవధిలోనే ఒకే కుటంబానికి చెందిన ఇద్దరు చనిపోవడంతో ఆ ఊరు విషాదంలో మునిగిపోయింది.
వారిది అందమైన కుటుంబం. ఇద్దరు పిల్లలతో తల్లిదండ్రులు సంతోషంగా జీవిస్తున్నారు. తల్లిదండ్రులు చిన్న చిన్న పననులు చేసుకుంటూ పిల్లలను చదివిస్తున్నారు. కూతురు బిటెక్ చదివితే, కుమారుడు పదో తరగతి చదువుతున్నాడు. అంతా బాగానే నడుస్తోంది. కుమారుడు పుట్టిన రోజు నాడు చేసిన ఓ చిన్న సరదా పనికి స్కూల్ యాజమాన్యం అతడిని మందలించింది. కొన్ని రోజులు స్కూల్ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో తల్లిదండ్రులు కూడా కొంత మందలించారు. ఈ చిన్న విషయానికే ఆ స్టూడెంట్ మనస్థాపంతో ఆత్మహత్యకు ఓడిగట్టాడు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. ఇది చూసి ఆ తండ్రి గుండె తట్టుకోలేదు. కుమారుడి సమాది దగ్గరకు వెళ్లి తీవ్రంగా రోదించాడు. ‘నువ్వు లేని బతుకు నాకెందుకు’ అనుకున్నాడో ఏమో తనతో తెచ్చుకున్న దుప్పటితో దగ్గరలో ఉన్న ఓ చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. హృదయ విచారకర ఘటన ఖమ్మం జిల్లాలో ఆదివారం రోజు జరిగింది.
సోదరుడి ఇంట్లోనే గుట్టుగా వ్యభిచార గృహం.. ఓ మహిళ ఘాతుకం...
ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన చల్లా రాంబాబు (48) కృష్ణవేణిలు దంపతులు. వీరు ఖమ్మం రూరల్ మండలంలోని పెద్దతాండ సమీపంలో ఓ హరితహారం నర్సరీలో పని చేస్తారు. వీరికి ఇద్దరు పిల్లలు. కూతురు కుసుమ బీటెక్ చదువుతుంటే కుమారుడు ప్రకాశ్ (16) స్థానికంగా ఉన్న ఓ స్కూల్ లో టెన్త్ క్లాసు చదువుతున్నాడు. ప్రకాశ్ ఇటీవల స్కూల్ మేట్స్‌తో కలిసి తన పుట్టిన రోజు వేడుకలు నిర్వహించుకున్నాడు. ఈ విషయం స్కూల్ మేనేజ్ మెంట్‌కు తెలిసింది. ఇలాంటి వేడుకలు తమ స్కూల్ స్డూడెంట్లు జరుపుకోకూడదని మందలించింది. దీంతో పాటు వారం రోజుల పాటు స్కూల్ నుంచి సస్పెండ్ చేసింది. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు కూడా కుమారుడిని కొంత మందలించారు. ఈ చిన్న విషయంలోనే తీవ్ర మనస్థాపం చెందిన ప్రకాశ్ క్షణికావేశంతో ఈ నెల 15వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కొంత సమయం తరువాత గమనించిన తల్లిదండ్రులు వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలోనే పరిస్థితి విషమించడంతో 18వ తేదీన మృతి చెందారు. దీంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాన్ని సత్తుపల్లికి తీసుకొచ్చారు. విరాట్ నగర్ ప్రాంతంలో ఉన్న ఓ తోట వద్ద ప్రకాశ్ మృతదేహానికి అంతక్రియలు నిర్వహించారు. అప్పటికే తీవ్ర వేదనలో ఉన్న తండ్రి రాంబాబు రాత్రి సమయంలో బయలుదేరి.. కుమారుడికి అంత్యక్రియలు నిర్వహించిన ప్రదేశానికి వచ్చాడు. కుమారుడు లేక ఎలా జీవించాలని బాధపడ్డాడు. తన వెంట తెచ్చుకున్న ఓ దుప్పటితో దగ్గర్లో ఉన్న ఓ చెట్టుకు ఉరేసుకున్నాడు. ఉదయం అక్కడికి వెళ్లిన స్థానికులకు రాంబాబు విగతజీవిగా ఉండటం గమనించారు. వెంటనే కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. వారందరూ అక్కడికి చేరుకున్నారు. రోజుల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతిచెందడం పట్ల ఆ గ్రామం విషాదంలో మునిగిపోయింది. ఈ ఘటనను చూసి గ్రామస్తులంతా కంటతడి పెట్టుకున్నారు. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
