Asianet News TeluguAsianet News Telugu

14 పెండింగ్ స్థానాలపై కేసిఆర్ వ్యూహం ఇదే..

ఏకంగా 105 మంది అభ్యర్థులను ప్రకటించిన తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు 14 సీట్లను పెండింగులో పెట్టడంపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. 

Why KCR put 14 seats in pending
Author
Hyderabad, First Published Sep 11, 2018, 3:52 PM IST

హైదరాబాద్: ఏకంగా 105 మంది అభ్యర్థులను ప్రకటించిన తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు 14 సీట్లను పెండింగులో పెట్టడంపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. వాటిని పెండింగులో పెట్టడం వెనక పక్కా వ్యూహం ఉందని అంటున్నారు. 

పెండింగులో ఉన్న స్థానాల్లో కొన్ని కాంగ్రెస్, బిజెపి ఎమ్మెల్యేలున్న స్థానాలు ఉన్నాయి. అందువల్ల అభ్యర్ధుల ఎంపిక‌లో కెసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు.  ఉమ్మడి న‌ల్లగొండ జిల్లాలో మొత్తం 12 స్థానాలు ఉండగా ప‌ది స్థానాల‌కు అభ్యర్థుల‌ను ప్రక‌టించారు. హుజూర్ న‌గ‌ర్ , కోదాడ నియోజ‌క‌వ‌ర్గాల‌ను పెండింగ్‌లో పెట్టారు. 

హుజూర్ నగర్ నుంచి తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండగా, కోదాడ నుంచి ఆయన సతీమణి పద్మావతి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ రెండు స్థానాల్లో బలమైన అభ్యర్థులను పోటీకి దింపాలనే యోచనలో కేసిఆర్ ఉన్నట్లు చెబుతున్నారు.

హుజూర్ నగర్ నుంచి గ‌తంలో పోటీ చేసి ఓడిపోయిన అమ‌రుడు శ్రీకాంతాచారి త‌ల్లి శంక‌ర‌మ్మ మ‌ళ్ళీ టికెట్ కోసం పోరాడుతున్నారు. త‌న‌కు టిక్కెట్ ఇవ్వక‌పోతే ఆత్మహ‌త్య చేసుకుంటాన‌ని బెదిరిస్తున్నారు. అయితే ఇక్కడ ఆర్ధిక‌, అంగ‌బ‌లం ఉన్న నేత‌ను బ‌రిలో నిలిపి ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెక్ పెట్టాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు. ఎంపీ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డిని పోటీకి దించాలనే ఆలోచనలో గులాబీ బాస్ ఉన్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి అనుచ‌రుడు ఎన్ఆర్ఐ శానంపూడి సైదిరెడ్డి పేరును పార్టీ అధిష్టానం పరిశీలిస్తోంది.
 
పిసిసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స‌తీమ‌ణి ప‌ద్మావ‌తి రెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కోదాడ నియోజ‌క‌వ‌ర్గంలో టిక్కెట్టు కోసం టీఆర్ఎస్ లో పలువురు పోటీ పడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే వేనేప‌ల్లి చంద‌ర్ రావు కూతురుతో పాటు గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయిన శ‌శిధ‌ర్ రెడ్డి టిక్కెట్ రేసులో ఉన్నారు.  ఎంపీ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి కూడా కోదాడ నుంచి పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు  చెబుతున్నారు. 

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మేడ్చల్, మ‌ల్కాజ్ గిరి, వికారాబాద్‌ నియోజ‌క‌వ‌ర్గాలు మినహా మిగ‌తా అన్నినియోజ‌క‌వ‌ర్గాల‌కు కేసీఆర్ అభ్యర్థుల‌ను ప్రక‌టించారు. మేడ్చల్ నుంచి గెలిచిన సుధీర్ రెడ్డిపై ప్రజ‌ల్లో తీవ్ర వ్యతిరేకత ఉండ‌టంతో పెండింగ్‌లో ఉంచిన‌ట్లు తెలుస్తోంది. ఇక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్న గారి ల‌క్ష్మారెడ్డి టీఆర్ఎస్ త‌రుపున పోటీ చేస్తార‌ని అంటున్నారు. అయితే తాను టీఆర్ఎస్ లో చేరడం లేదని ఆయన స్పష్టం చేశారు. దాంతో న‌క్కా ప్రభాక‌ర్ గౌడ్ పేరును టీఆర్ఎస్ నాయకత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.

వికారాబాద్ నుంచి గెలిచిన సంజీవ‌రావుకు అనారోగ్యం కార‌ణాల‌తో టికెట్ ఇవ్వడం లేదు. కాంగ్రెస్ నేత‌లు గ‌డ్డం ప్రసాద్ లేక మాజీ మంత్రి ఏ చంద్రశేఖ‌ర్ టీఆర్‌ఎస్ టికెట్‌పై పోటీ చేస్తార‌ని అంటున్నారు. మ‌ల్కాజ్ గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే క‌న‌కా రెడ్డి కూడా అనారోగ్యం వల్ల పోటీ నుంచి త‌ప్పుకున్నారు. 

అయితే ఆయ‌న కోడ‌లు, లోక‌ల్ కార్పోరేట‌ర్ విజ‌యశాంతి రెడ్డికి టికెట్ ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. ఎంపీ మ‌ల్లారెడ్డి కూడా ఈ స్థానం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. టిఆర్ఎస్ గ్రేట‌ర్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మైనంపల్లి హ‌నుమంతరావు కూడ మ‌ల్కాజ్ గిరిపై  కన్నేశారు. 

ఉమ్మడి క‌రీనంగ‌ర్ జిల్లా చొప్పదండి నియోజ‌క‌వ‌ర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే బొడిగే శోభ టికెట్ పెండింగ్ లో ఉంది. హుస్నాబాద్ ప్రజా ఆశీర్వాద స‌భ‌లో కెసీఆర్ ను క‌లిసే ప్రయ‌త్నం చేశారు. అయితే,  అందులో ఫలితం సాధించలేకపోయారు. దీంతో ఆమెకు ఇక టిక్కెట్ రాదని భావిస్తున్నారు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో సంకే ర‌విశంక‌ర్ కు టిక్కెట్ ఇవ్వాల‌ని స్థానిక నేత‌లు కెసీఆర్ చెప్పిన‌ట్లు స‌మాచారం. మాజీ మంత్రి వినోద్ పేరు పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. 


ఉమ్మడి మెద‌క్ జిల్లాలోని జ‌హీరాబాద్ త‌ప్ప మిగ‌తా నియోజ‌క‌వ‌ర్గాల‌కు అభ్యర్థుల‌ను ప్ర‌క‌టించారు. ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే గీతా రెడ్డి టీఆర్ఎస్ లో చేరి ఎన్నిక‌ల్లో పోటీ చేస్తార‌ని ప్రచారం జరిగింది. అయితే గీతా రెడ్డి ఆ ప్రచారాన్ని కొట్టిపారేశారు. ఎస్సీ,ఎస్టీ కార్పోరేష‌న్ చైర్మన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్ పేరు బలంగా వినిపిస్తోంది. 

వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం అభ్యర్ధిని పార్టీ ప్రక‌టించ‌లేదు. దీంతో కొండా సురేఖ కాంగ్రెసులో చేరడానికి సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి. దాంతో మేయ‌ర్ న‌న్నపునేని న‌రేంద‌ర్, గుండు సుధారాణి, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, పొచం పల్లి శ్రీనివాస్ రెడ్డి టికెట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు.
 
ముషీరాబాద్‌, మ‌ల‌క్ పేట‌, అంబ‌ర్ పేట‌, గోషా మ‌హ‌ల్‌, ఖైర‌తాబాద్ , చార్మినార్ నియోజ‌క‌వ‌ర్గాల‌ అభ్యర్థులను కూడా ఇంకా ప్రక‌టించ‌లేదు. ఖైరతాబాదు కోసం పోటీ తీవ్రంగా ఉంది. మాజీ మంత్రి దానం నాగేంద‌ర్ తో పాటు కార్పోరేట‌ర్ విజ‌యా రెడ్డి, నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ మ‌న్నె గోవ‌ర్ధన్ రెడ్డి, కేకే కూతురు విజ‌యల‌క్ష్మిఈ టికెట్ కోసం ప్రయ‌త్నాలు చేస్తున్నారు. దానం నాగేందర్ కు గోషామహల్ టికెట్ దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. 


చార్మానార్, మ‌ల‌క్ పేట నియోజ‌క‌వ‌ర్గాలకు టిక్కెట్ కోసం పోటీ పెద్దగా లేదు. ముషీరాబాద్ నుంచి టీఆర్ఎస్ త‌రుపున పోటీ చేసేందుకు హోంమంత్రి నాయిని న‌ర్సింహ్మా రెడ్డి అల్లుడు, కార్పోరేట‌ర్ శ్రీనివాస్ రెడ్డితో పాటు టిఆర్ఎస్ రాష్ట్ర బిసి సెల్ అధ్యక్షుడు ముఠా గోపాల్ ప్రయ‌త్నాలు చేస్తున్నారు. 

అంబ‌ర్ పేట్ నియోజ‌వ‌ర్గంలో బిజెఎల్పీ నేత కిష‌న్ రెడ్డిని ఓడించగల అభ్యర్థి కోసం కేసిఆర్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. గ‌తంలో పోటీచేసి ఓడిపోయిన ఎడ్ల సుధాక‌ర్ రెడ్డి, మాజీ మంత్రి కృష్ణాయాద‌వ్ పోటీ పడుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios