హుజూరాబాద్‌లో ఏం జరుగుతోంది?: ఈటల లేకుండానే గ్రామ సభ

హూజూరాబాద్ నియోజకవర్గంలో నిర్వహించిన గ్రామ సభలో ట్విస్ట్ చోటు చేసుకొంది. స్థానిక ఎమ్మెల్యే ఈటల రాజేందర్ లేకుుండానే గ్రామ సభ నిర్వహించారు.

why Etela rajender not attend singaram grama sabha

హూజూరాబాద్: స్థానిక ఎమ్మెల్యే, మంత్రి ఈటల రాజేందర్  లేకుండానే హూజూరాబాద్ నియోజకవర్గంలోని సింగాపూర్ గ్రామంలో 30 రోజుల గ్రామ ప్రణాళిక తయారీకి సంబంధించిన గ్రామ సభ శుక్రవారం నాడు జరిగింది. సీజనల్ వ్యాధులపై వైద్యశాఖాధికారులతో సమీక్ష సమావేశాల కారణంగా మంత్రి ఈటల రాజేందర్ ఈ సమావేశానికి హాజరుకాలేదని చెబుతున్నారు. అయితే ఇటీవల కాలంలో ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ గ్రామ సభ నిర్వహణ సర్వత్రా చర్చకు దారితీసింది.

హుజూరాబాద్ నియోజకవర్గంలోని సింగాపూర్ గ్రామంలో 30 రోజుల గ్రామ ప్రణాళిక తయారీ నిర్వహణ కోసం గ్రామ సభను నిర్వహించారు. ఈ సభలో టీఆర్ఎస్ ఎంపీ, మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతారావుతో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యే సతీష్ కూడ పాల్గొన్నారు. కానీ, స్థానిక ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాత్రం హాజరు కాలేదు.

ఈ గ్రామ సభలో పంచాయితీరాజ్ సెక్రటరీ వికాస్ రాజ్, జిల్లా కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ లు పాల్గొన్నారు. ఇద్దరు ఐఎఎస్ అధికారులతో పాటు ఎంపీ లక్ష్మీకాంతారావు, ఎమ్మెల్యే సతీష్ కూడ పాల్గొన్నారు.కానీ, ఈ గ్రామ సభలో స్థానిక ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొనలేదు. 

గత నెల 29వ తేదీన హూజూరాబాద్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి తనకు బిక్ష కాదన్నారు. గులాబీ జెండాకు ఓనర్లమని ప్రకటించారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ఈటల రాజేందర్ తమ నాయకుడు కేసీఆర్ అంటూ మరో ప్రకటన విడుదల చేశారు. ఈ వ్యాఖ్యలు టీఆర్ఎస్ లో చర్చకు దారి తీశాయి.

ఈ నెల 5వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కూడ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనతో పాటు మంత్రి ఈటల రాజేందర్ కూడ వాస్తవాలను మాట్లాడుతామన్నారు. ఉద్యమం నుండి వచ్చినందునే ఇలా మాట్లాడుతామని రసమయి బాలకిషన్ కుండబద్దలు కొట్టారు.ఈ వ్యాఖ్యలు చేసిన మరునాడే హూజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ లేకుండానే గ్రామ సభ నిర్వహించడం ప్రస్తుతం చర్చకు దారితీసింది.

30 రోజుల గ్రామ ప్రణాళికను సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నారు. ఈ కార్యక్రమానికి ఈటల రాజేందర్ హాజరుకాలేదు. ఈ నెల 2వ తేదీ నుండి పలు ఆసుపత్రులను మంత్రి ఈటల రాజేందర్ పరిశీలిస్తున్నారు. ఆయా ఆసుపత్రుల్లో రోగులను పరామర్శిస్తున్నారు. ఆసుపత్రుల్లో సౌకర్యాల పరిస్థితులపై ఆరా తీస్తున్నారు.

సీజనల్ వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖాధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచిస్తున్నారు. 

శుక్రవారం నాడు రాత్రి కూడ వైద్య, ఆరోగ్యశాఖాధికారులతో మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న కారణంగానే డాక్టర్లకు సెలవులను కూడ రద్దు చేశారు. ఈ కారణాలతోనే ఈటల రాజేందర్ ఈ సమావేశానికి హాజరుకాలేదని ఆయన వర్గీయులు చెబుతున్నారు. శుక్రవారం ఉదయం నుండి నిరాటంకంగా సమావేశాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ కారణంగానే ఆయన గ్రామ సభకు హాజరుకాలేక పోయినట్టుగా మంత్రి కార్యాలయవర్గాలు చెబుతున్నాయి.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios