ఆనాడు రజకార్లను తరమికొట్టిన ఘన చరిత్ర ఈ గ్రామానికి ఉంది.

తెలంగాణలో కాషాయ జెండా పాతాలనుకుంటున్న కమలనాథులు 2019 ఎన్నికలకు ముందే పక్కా వ్యూహంతో ముందుకొస్తున్నారు.

ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష పేరుతో ఇతర పార్టీ నేతలను బీజేపీలోకి లాగడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ఇప్పుడు ఏకంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నే తెలంగాణ పర్యటన మొదలుపెట్టారు. ఇందులో కూడా చాలా వ్యూహాత్మంగా తెలంగాణ సెంటిమెంట్ ను రగిలించేలా ప్రాంతాలను ఆయన ఎన్నుకోవడం విశేషం.

ముఖ్యంగా ఆయన నల్లగొండ జిల్లాలోని తేరటుపల్లిలో పర్యటించుకోవాలనుకోవడం వెనక చాలా కారణాలే ఉన్నాయి.

ఆనాడు రజకార్లను తరమికొట్టిన ఘన చరిత్ర ఈ గ్రామానికి ఉంది. అలాగే, ఇదే గ్రామంలో గుండిగోని మైసయ్య గౌడ్ అనే వ్యక్తి మావోయిస్టుల చేతిలో హత్యకు గురయ్యారు.

ఇంతకీ ఈ మైసయ్య గౌడ్ ఎవరంటే..

అప్పట్లోనే బీజేపీలో క్రీయాశీలకంగా పనిచేసిన సీనియర్ కార్యకర్త.

1999 మార్చి 27న తేరటుపల్లిలో చేనేత కార్మికుల సదస్సు కోసం కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు ఆయన వచ్చారు.

ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకున్న కనగల్‌ దళ సభ్యులు ఆయన అనుచరులను పట్టుకొని మైసయ్య గౌడ్‌ ఎక్కడ ఉన్నాడో చెప్పాలంటూ బెదిరించారు.

కార్యకర్తల ఇంట్లో ఉన్న మైసయ్య గౌడ్‌ను బయటకు రాకుంటే అనుచరులను చంపేస్తామంటూ హెచ్చరించారు. బయటకు వచ్చిన మైసయ్యను పట్టుకొచ్చి చౌరస్తాలో కాల్చి చంపారు.

ఇప్పటికీ ఆయన త్యాగానికి గుర్తుగా ఆ గ్రామంలో ప్రతిఏటా సంస్మరణ కార్యక్రమాలను బీజేపీ నేతలు నిర్వహిస్తుంటారు.

ఇప్పుడు అమిత్ షా అక్కడ పర్యటించి మైసయ్యకు ఘన నివాళి అర్పించడంతో పాటు మావోయిస్టుల అకృత్యాలను దేశస్థాయిలో తీసుకరావడానికి దీన్నో సాధనంగా ఉపయోగించుకోనున్నట్లు తెలుస్తోంది.