కడియం శ్రీహరి.. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు.. తెలుగుదేశం పార్టీలో క్రీయాశీలక పాత్ర పోషించిన ఆయన తర్వాత కాలంలో టీఆర్ఎస్‌లో చేరారు. తెలంగాణ తొలి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

అప్పట్లో పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీ బిజీగా గడిపిన కడియానికి కేసీఆర్ రెండో మంత్రివర్గంలో స్థానం లభించలేదు. కేవలం ఎమ్మెల్సీగానే ఆయన కొనసాగుతున్నారు. కేసీఆర్‌తో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన ఆయన .. ప్రస్తుతం వ్యూహాత్మక మౌనం పాటించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.

అయితే వీటికి కారణాలు లేకపోలేదు.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే రాజయ్యపై ఆరోపణలకు దిగిడమే ప్రస్తుత పరిస్ధితికి కారణమంటున్నారు విశ్లేషకులు. స్టేషన్ ఘన్‌పూర్ టికెట్‌ను తన కుమార్తె కావ్యకు కేటాయించాలని అధినేతపై ఒత్తిడి తెచ్చినప్పటికీ.. ఫలితం దక్కలేదు.

అయినప్పటికీ కడియం సర్దుకుపోయారు. అయితే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో తనకు సమకాలీకుడైన ఎర్రబెల్లి దయాకర్‌రావుకు మంత్రి పదవి ఇవ్వడం ఆయనకు తీవ్ర మనస్థాపాన్ని కలిగించిందని... అందువల్లే శ్రీహరి పార్టీ కార్యక్రమాలకు, ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని వరంగల్ జిల్లాలో నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. అయితే తనకు ఆహ్వానం అందిన కార్యక్రమాల్లో కడియం చురుగ్గా పాల్గొంటూ పార్టీపై విధేయత చూపుతున్నారు.

ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాకు అన్నీ తానై నడిపిన వ్యక్తి.. ఇఫ్పుడు సాదాసీదాగా ఉండాల్సి రావడం ఆయన అనుచరులకు మింగుడు పడటం లేదు. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా మౌనంగానే ఉండటం మంచిదని కడియం శ్రీహరి భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.