హైదరాబాద్: కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రాములమ్మ యాక్టివ్ పాలిటిక్స్ కు కొంత దూరంగా ఉండే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం అనుసరిస్తున్న తీరుతో విజయశాంతి సినిమాల్లో నటించాలని భావిస్తోందని సమాచారం.

2018 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో విజయశాంతి క్రియాశీలకంగా పనిచేసింది. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా విజయశాంతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడు ఎంపీ స్థానాలు దక్కించుకొంది. 2018 ఎన్నికల్లో విజయశాంతి  పోటీకి దూరంగా ఉంది.

కాంగ్రెస్ పార్టీ మాజీ  జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ టీమ్ లో విజయశాంతి సభ్యురాలిగా గుర్తింపు పొందింది.  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడ  కూడ సరిగా పట్టించుకోవడం లేదని విజయశాంతి మదనపడుతున్నట్టుగా సమాచారం.

సంగారెడ్డిలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశానికి కూడ విజయశాంతికి ఆహ్వానం రాలేదు. పార్టీలో తనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన రాహుల్ గాంధీ కూడ పార్టీ పదవికి రాజీనామా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు కూడ  ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్షం టీఆర్ఎస్ శాసనసభపక్షంలో విలీనమైంది.

మరికొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు  బీజేపీ వైపు చూస్తున్నారు. ఈ తరుణంలో యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉండాలని విజయశాంతి భావిస్తున్నట్టు సమావేశం. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించే సినిమాలో విజయశాంతి ఓ పాత్ర పోషించనున్నారు.

మరో వైపు విశాల్ హీరో గా నటించే సినిమాతో పాటు అమితాబచ్చన్ సినిమాలో నటించేందుకు విజయశాంతికి అవకాశం వచ్చిందని సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అయితే ఇటీవల కాలంలో విజయశాంతి కేసీఆర్ ప్రభుత్వం తీసుకొంటున్న నిర్ణయాలపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు.

సోషల్ మీడియా వేదికగా విజయశాంతి తన వాణిని విన్పిస్తున్నారు. సినిమాల్లో నటించే సమయంలో కూడ తన వాణిని విన్పించేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నట్టుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరో వైపు విజయశాంతి కూడ బీజేపీలో చేరే అవకాశం ఉందనే ప్రచారం కూడ సాగుతోంది. అయితే విజయశాంతి బీజేపీని వీడి స్వంత పార్టీని ఏర్పాటు చేసుకొన్నారు. అయితే బీజేపీలో చేరే  అవకాశం లేదని చెబుతున్నారు.విజయశాంతి సినిమాలపైనే ప్రస్తుతం దృష్టిని కేంద్రీకరించనున్నారు.