జనగామ: మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య  ఇంట్లో  కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు కోసం పోరు సాగుతోందని ప్రచారం సాగుతోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఈ రకమైన ప్రచారం తీవ్రమైంది. ఈ  పరిస్థితుల నేపథ్యంలో  పొన్నాల కుటుంబంలో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు ఎవరికీ దక్కుతోందనే  చర్చ ప్రస్తుతం వరంగల్ జిల్లాలో ఉత్కంఠకు తావిస్తోంది.

ఒక్క కుటుంబంలో ఒక్కరికే కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు, 70 ఏళ్లు దాటితే టిక్కెట్టు  ఇవ్వకూడదని కాంగ్రెస్ పార్టీ  నిర్ణయం తీసుకొందని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఈ దఫా జనగామ నుండి మాజీ  పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు దక్కేనా అనే చర్చ సాగుతోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం సాగుతుండడం ఆ పార్టీ కార్యకర్తల్లో గందరగోళాన్ని సృష్టిస్తోంది.

70 ఏళ్లు దాటినవారికి  కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు  ఇవ్వకూడదని నిర్ణయం  తీసుకొన్నారనే ప్రచారం ఉన్న నేపథ్యంలో పొన్నాల లక్ష్మయ్యకు టిక్కెట్టు రాకపోవచ్చని సోషల్ మీడియాలో ఊహాగానాలు వెలువడుతున్నాయి.

పొన్నాలకు టిక్కెట్టు రాకపోతే ఆ కుటుంబంలో మరేవరికీ  టిక్కెట్టు కేటాయిస్తారనే  విషయమై చర్చ సాగుతోంది. పొన్నాల కోడలు వైశాలి క్రియాశీలక రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. మహిళా కాంగ్రెస్  వరంగల్ జిల్లా  అధ్యక్షురాలుగా వైశాలి కొనసాగుతున్నారు. పొన్నాలకు  కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టిక్కెట్టు ఇవ్వకపోతే  ఆయన కోడలు వైశాలికి ఈ స్థానం నుండి టిక్కెట్టు ఇస్తారనే ప్రచారం సాగుతోంది.

జనగామ నుండి పోటీ చేసేందుకు వైశాలి కూడ సుముఖంగా ఉన్నారని చెబుతున్నారు. అయితే  తనను కాదని  వైశాలికి టిక్కెట్టు కేటాయించడాన్ని పొన్నాల వ్యతిరేకిస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.

ఈ ప్రచారంతో పొన్నాల వర్గీయుల్లో గందరగోళం నెలకొంది. అయితే పార్టీలో సీనియర్ నేత పొన్నాలను కాదని... ఆయన కోడలు  వైశాలికి టిక్కెట్టు కేటాయిస్తారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.