హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని ఆరో ప్యాకేజీలో మొదటి పంపు వెట్ రన్ విజయవంతం కావడం పట్ల మాజీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం నాడు వెట్ రన్  విజయవంతం కావడం వెనుక మంత్రి హరీష్ రావు కృషిని ఎవరూ కూడ కాదనలేరు. కానీ, ఈ విషయంలో హరీష్ రావు కేవలం ట్వీట్‌కే పరిమితం కావాల్సి వచ్చింది.

 

తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో తొలిసారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన సమయంలో  భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు కొనసాగారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వేగవంతంగా కొనసాగండంలో హరీష్ రావు కృషి ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద రాత్రి పూట పడుకొని కూడ ఆయన ప్రాజెక్టు పనుల ప్రగతిని పరిశీలించారు.

టైమ్ షెడ్యూల్ పెట్టుకొని  ఆ షెడ్యూల్ ప్రకారంగా ఆయా ప్రాజెక్టులు, ప్యాకేజీల పనులు పూర్తి చేసేలా హరీష్ రావు అధికారులను పరుగులు పెట్టించారు. ఇవాళ వెట్ రన్  విజయవంతం కావడంలో  కూడ హరీష్ రావు కృషిని ఎవరూ మరువలేరని పలువురు అధికారులు గుర్తు చేసుకొంటున్నారు.

రెండోసారి కేసీఆర్ మంత్రివర్గంలో హరీష్ రావుకు మంత్రి పదవి దక్కలేదు. .గత టర్మ్‌లో మాదిరిగా మరోసారి కేసీఆర్ మంత్రివర్గంలో చోటు దక్కి భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా ఉంటే  వెట్ రన్ ను హరీష్ రావు నిర్వహించేవాడనే ఆయన సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు. మంత్రి పదవిలో లేనందునే హరీష్ రావు వెట్ రన్  విజయవంతం కావడంపై ట్వీట్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చిందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత హరీష్ రావుకు మంత్రి పదవి ఖాయమని ఆయన వర్గీయులు అభిప్రాయంతో ఉన్నారు. మరోసారి  ఆయనకు భారీ నీటి పారుదల శాఖ దక్కితే కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు  ఇతర ప్రాజెక్టులను నిర్ణీత షెడ్యూల్ కంటే ముందే ప్రాజెక్టులను పూర్తి చేసుకొనే అవకాశం ఉంటుందని  ఆయన సన్నిహితులు చెబుతున్నారు.