సంగారెడ్డి:  నిద్రలో ఉన్న తన గొంతుకు కత్తి పెట్టడంతో మెలకువ వచ్చి తనను చంపొద్దని  కాళ్లు పట్టుకొని బతిమిలాడినా కూడ వినలేదని,  తన గొంతును కత్తితో కోశాడని కుమార్ పెద్ద కూతురు మల్లీశ్వరీ చెప్పారు.

ఉమ్మడి మెదక్ జిల్లా రామచంద్రాపురం వాంబే కాలనీలో ఎరుకల కుమార్ అనే వ్యక్తి భార్యపై కోపంతో మంగళవారంనాడు రాత్రి ఇద్దరు పిల్లలను గొంతుకోసి చంపేశాడు.  

నిఖిల్, శరణలను చంపేసిన తర్వాత వాళ్ల పక్కనే పడుకొన్న మల్లీశ్వరీని కూడ చంపేందుకు కుమార్ ఆమె గొంతుపై కత్తి పెట్టాడు.  అయితే  గొంతుకు కత్తి పెట్టగానే తాను నిద్ర లేచినట్టు  మల్లీశ్వరీ చెప్పారు.

తనను చంపొద్దని పదేళ్ల మల్లీశ్వరీ తండ్రిని కాళ్లు పట్టుకొని బతిమిలాడినట్టుగా ఆమె మీడియాకు వివరించారు. అయితే ఆ సమయంలో కత్తిని పక్కన పడేసి సిగరెట్టు తాగాడని ఆమె గుర్తు చేసుకొంది.

ఆ తర్వాత కత్తి తీసుకొని తన గొంతును కట్ చేసి కింద పడిపోయాడని  ఆమె చెప్పారు.  తన గొంతు నుండి రక్తం కారుతుండగా వెళ్లి నాన్నమ్మ, అత్తను లేపినట్టుగా మల్లీశ్వరీ చెప్పారు.

ఆ తర్వాత నాన్న కూడ పక్కకు వెళ్లి ఆత్మహత్య చేసుకొనేందుకు ప్రయత్నించాడని ఆ బాలిక వివరించింది. స్థానికులు  ఈ విషయాన్ని గమనించి అతడిని తీసుకొచ్చారని చెప్పారు.

తన చెల్లె, తమ్ముడు పడుకొన్న చోటునే రక్తం ధారగా పోయిందని ఆ బాలిక వివరించింది. పోలీసులు వచ్చి  చెల్లె, తమ్ముడిని దుప్పట్లో చుట్టుకొని తీసుకెళ్లారని ఆ బాలిక చెప్పింది.

నెల రోజుల క్రితం భార్య, భర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో భార్య పుట్టింటికి వెళ్లింది. భార్యపై కోపంతో కుమార్ మద్యం తాగొచ్చి పిల్లలను హత్య చేశాడు.

 కుమార్‌కు 12 ఏళ్ల క్రితం పెళ్లైంది. 11 ఏళ్ల నుండి కూడ ప్రతి రోజూ తమ మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయని కుమార్ భార్య చెప్పారు. గతంలో కూడ తమందరికీ ఉరేసి చంపాలని ప్లాన్ చేస్తే తప్పించుకొన్నామని  కుమార్ భార్య గుర్తు చేసుకొన్నారు.ఇద్దరు పిల్లలను కుమార్ ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

సంబంధిత వార్తలు

భార్యపై కోపంతో ఇద్దరు పిల్లల్ని చంపాడు