Telangana: గత కొన్నేళ్లుగా దేశంలో మత అసహనం పెరిగిపోయిందని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ఇది ఆందోళనకర విషయమనీ, ఇది మరింతగా దిగజారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
Telangana: ఇటీవల దేశంలో హిజాబ్ వివాదం తీవ్ర చర్చకు తెరలేపింది. ఈ వివాదంపై మంగళవారం నాడు కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల వేషధారణకు ప్రభుత్వానికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. గత కొన్నేళ్లుగా దేశంలో మత అసహనం పెరిగిపోయిందని తెలిపారు. ఇది ఆందోళనకర విషయమనీ, ఇది మరింతగా దిగజారుతోందని అన్నారు.
అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. సరిహద్దు రాష్ట్రమైన కర్నాటకలో రగులుతున్న హిజాబ్ వివాదాన్ని ప్రస్తావించారు. ప్రజల సమస్యలను విస్మరించి, హిజాబ్ వివాదాన్ని అనవసరంగా పెంచుతున్నారని పేర్కొన్నారు. ప్రజలు వేసుకునే దుస్తులకు ప్రభుత్వానికి సంబంధం ఏంటని సీఎం ప్రశ్నించారు. ఎవరైనా పెట్టుబడిదారుడు తన విమానం నుండి దిగిన తర్వాత హిజాబ్ సమస్యపై నగరంలో కర్ఫ్యూ ఉందని తెలిస్తే, అతను తన డబ్బును పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడడు, అది ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని తెలిపారు.
రాజకీయ మైలేజీ కోసం ప్రజలను మత ప్రాతిపదికన విభజించడం, హిజాబ్ వంటి చిన్న విషయాలపై మత హింసను రెచ్చగొట్టడం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వ్యూహమని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలు నెలకొని ఉన్నందున తెలంగాణలో అనేక ఫార్మా ఐటీ, ఇతర పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. బీజేపీ మతపరమైన విధానాల కారణంగా దేశంలో మతపరమైన అసహనం పెరుగుతోంది, దీని కారణంగా దేశంలో కొత్త పరిశ్రమలు స్థాపించబడకపోవడంతో యువతలో విస్తృత స్థాయిలో నిరుద్యోగం ఏర్పడుతోందని అన్నారు.
హైదరాబాద్‌లో 11 రాష్ట్రాల ప్రజలు సంపూర్ణ సామరస్యంతో ప్రశాంతంగా జీవిస్తున్నారని కేసీఆర్ అన్నారు. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే మత సామరస్యం తప్పనిసరి అని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మతపరమైన హింస మరియు హత్యల సంఘటనలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. లౌకిక మేధావులు, సమాజిక కార్యకర్తలు, నిపుణులు ఈ విషయాలను సరిదిద్దే చర్చను ప్రారంభించాలని అన్నారు. ఉక్రెయిన్ నుండి 20000 మంది భారతీయ విద్యార్థులు తిరిగి రావడం గురించి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తావించారు. ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన భారత విద్యార్థుల్లో 740 మంది తెలంగాణకు చెందిన వారు ఉన్నారని తెలిపారు. దేశంలో తగినంత వైద్య సీట్లు అందుబాటులో ఉంటే ఈ విద్యార్థులు ఉక్రెయిన్‌కు వెళ్లేవారు కాదని కేంద్రంపై విమర్శలు గుప్పించారు.
కాగా, కర్నాటకతో పాటు పలు రాష్ట్రాల్లోని ప్రాంతాల్లో Hijab వివాదం ఉద్రిక్తలకు దారి తీసింది. ఈ క్రమంలోనే న్యాయస్థానాలు రంగంలోకి దిగాయి. హిజాబ్ నేపథ్యంలో రాజుకున్న వివాదంపై Karnataka High Court మంగళవారం నాడు సంచలన తీర్పు ఇచ్చింది. విద్యా సంస్థల్లో హిజాబ్ తప్పని సరికాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. విద్యా సంస్థల్లో స్కూల్ నియమాల ప్రకారం.. యాజమాన్యం సూచించిన యూనిఫామ్ ను ధరించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. హిజాబ్ ను నిషేధించాలని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. యూనిఫామ్ పై విద్యార్ధులు అభ్యంతరం చెప్పకూడదని కూడా హైకోర్టు తేల్చి చెప్పింది.
