తెలంగాణ రాష్ట్రంలో మాస్క్​ను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే మాస్క్​ ధరించకుంటే జరిమానా విధిస్తామని ప్రభుత్వం ప్రకటించి, ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నిబంధనను శుక్రవారం నుంచి తప్పనిసరి చేస్తూ ప్రభుత్వ ఆదేశాలిచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్​ ధరించకుంటే ఎఫ్​ఐఆర్​ నమోదు చేయాలని, కోర్టులో హాజరుపర్చాలని పేర్కొంది. 

విపత్తు నిర్వహణ చట్టంతో పాటుగా ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని పోలీసులకు సూచించారు. శుక్రవారం నుంచి కచ్చితంగా అమలు చేయాలని ఆదేశాలిస్తూ ప్రభుత్వం నుంచి అన్ని జిల్లాలకు సమాచారం పంపించారు. మాస్కు ధరించకుంటే ఇప్పటి వరకు రూ. 1000 జరిమానా విధిస్తుండగా… ఇక నుంచి కేసు కూడా నమోదు చేయనున్నారు

ముఖ్యంగా హైద‌రాబాద్ న‌గ‌రంలో ముఖానికి మాస్క్‌ ధరించకుండా రోడ్లపై, వాహనాల్లో తిరిగే వారిని ఫోటోలు తీసి జరిమానా విధించనున్నారు… ఇందుకు ట్రాఫిక్ పోలీసులు స్పెష‌ల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మాస్క్ లేకుండా ఎవ‌రైనా బ‌య‌ట క‌నిపిస్తే వారికి భారీ జ‌రిమానా విధించేందుకు ట్రాఫిక్‌ పోలీసులు నడుం బిగించారు.

ఇకపై మూడు పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలోని ప్రధాన ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు మాస్క్‌ లేకుండా వెళ్తున్నవారి ఫోటోలు తీసి వాహనం నంబరు ఆధారంగా ఇంటికి ఈ-చలానాలను పంపనున్నారు. ఇప్పటికే మాస్కులు లేకుండా వాహనాల్లో వెళ్తున్న వారిపై హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు 15 వేల కేసులు నమోదు చేశారు. కాగా మాస్కులు లేకుండా ఉన్న వారిని గుర్తించడంలో ట్రాఫిక్‌ పోలీసులతోపాటు ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ప్రధానపాత్ర పోషించనున్నాయి.