Asianet News TeluguAsianet News Telugu

ఆరేడు మాసాల్లో నల్గొండలో రూ. 1544 కోట్లతో అభివృద్ది పనులు: కేటీఆర్


రానున్న ఆరేడు మాసాల్లో  నల్గొండ జిల్లాలోని అన్ని  నియోజకవర్గాల్లో  పెద్ద ఎత్తున అభివృద్ది కార్యక్రమాలను నిర్వహిస్తామని  తెలంగాణ మంత్రి కేటీఆర్  చెప్పారు.  మునుగోడులో  కూడా  పలు  శాఖల ద్వారా అభివృద్ది  కార్యక్రమాలను చేపడుతామన్నారు.

 We Will start Rs 1544 Crore  Development  works  in nalgonda district  soon: Telangana Minister KTR
Author
First Published Dec 1, 2022, 5:54 PM IST

మునుగోడు:రానున్న ఆరేడు  నెలల్లో  ఉమ్మడి నల్గొండ జిల్లాలో రూ. 1544 కోట్లతో  అభివృద్ది పనులు చేపట్టనున్నామని  తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్  చెప్పారు.కగురువారంనాడు  మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి  కార్యక్రమాలపై మంత్రి కేటీఆర్  సమీక్ష నిర్వహించారు.ఈ సమీక్ష ముగిసిన తర్వాత మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కేవలం  నాలుగు శాఖల ఆధ్వర్యంలోనే  రూ. 1544 కోట్లతో  ఈ  పనులు చేయనున్నామన్నారు. మిగిలిన శాఖల ఆధ్వర్యంలో  కూడా  పనులు ప్రారంభించనున్నామని మంత్రి కేటీఆర్ వివరించారు. 

 మునుగోడు నియోజకవర్గంలో రహదారుల కోసం రూ. 100 కోట్లను ఖర్చు చేస్తామన్నారు మంత్రి కేటీఆర్.   పంచాయితీ రాజ్  శాఖలో  రూ. 170 కోట్ల పనులు చేయనున్నామన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా రూ. 25 కోట్లతో  పనులు చేయనున్నామన్నారు. చండూరులో  వంద పడకల ఆసుపత్రిని ఏర్పాటు  చేస్తామని  మంత్రి కేటీఆర్  హామీ ఇచ్చారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని అమలు చేస్తామని  కేటీఆర్ హామీ ఇచ్చారు. 

మునుగోడు  ఉప  ఎన్నికను పురస్కరించుకొని  ఈ  ప్రాంత  ప్రజల  సమస్యలను అధ్యయనం చేసే అవకాశం తనకు  దక్కిందన్నారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో తాము ఇచ్చిన హామీలను  సాధ్యమైనంత త్వరగా  పరిష్కరిస్తామన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ ను గెలిపిస్తే  గుండెల్లో  పెట్టుకుంటానన్నారు.  ఈ  వాగ్దానాన్ని అమలు చేసే ప్రయత్నంలో భాగంగా   ఇవాళ  సమీక్ష నిర్వహిస్తున్నానన్నారు. మునుగోడుకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేందుకు  ప్రయత్నిస్తున్నామన్నారు. మునుగోడు  ప్రజలకు అండగా  ఉంటామని చెప్పేందుకు ఇక్కడికి  వచ్చినట్టుగా  మంత్రి కేటీఆర్  తెలిపారు. మునుగోడు  ప్రజలు  గెలిపించింది కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని కాదు తమ అందరిని అని ఆయన  చెప్పారు.

 ఉమ్మడి  నల్గొండ జిల్లాలోని  12 అసెంబ్లీ సీట్లలో  12 సీట్లలో  టీఆర్ఎస్  అభ్యర్ధులను గెలిపించి చరిత్ర సృష్టించారన్నారు.గత  ప్రభుత్వాల హయంలో  నల్గొండ  జిల్లాలో  ఒక్క మెడికల్ కాలేజీ  లేదన్నారు.
దేశంలో అత్యధికంగా  వరిని పండిస్తున్న రాష్ట్రంగా  తెలంగాణ రికార్డు సృష్టించిందన్నారు.  యాదాద్రి క్షేత్రాన్ని తిరుమలకు ధీటుగా  తీర్చిదిద్దామన్నారు. దామరచర్లలో అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు రాబోయే వందేళ్ల విజన్  అని  కేటీఆర్  చెప్పారు.దండు మల్కాపూర్  లో  పారిశ్రామిక పార్క్ కు అనుకొని  ఉన్న 100 ఎకరాల్లో టాయ్  పార్క్   ఏర్పాటు  చేస్తున్నామన్నారు కేటీఆర్.
 

Follow Us:
Download App:
  • android
  • ios