హైదరాబాద్:  కరోనా కారణంగా నిరుద్యోగ భృతి ఇవ్వలేకపోయామని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు.ద్రవ్య వినిమయ బిల్లుపై తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్  శుక్రవారం నాడు ప్రసంగించారు. 

నిరుద్యోగులను ఎలా గుర్తించాలనే దానిపై కసరత్తు చేస్తున్న సమయంలోనే గత ఏడాది కరోనా వైరస్ రావడంతో ఈ ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయిందన్నారు.ఇతర రాష్ట్రాల్లో నిరుద్యోగులకు ఎలా నిరుద్యోగభృతి ఇస్తున్నారనే  విషయమై ఆరా తీయాలని ప్లాన్ చేశామన్నారు.కరోనా సెకండ్ వేవ్ ఎలా ఉంటుందో పరిశీలించిన మీదట నిరుద్యోగ భృతిని అమలు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని ఆయన తేల్చి చెప్పారు.

హాస్టల్ విద్యార్ధులకు మెస్ ఛార్జీలు పెంచుతామని ఆయన తెలిపారు. అసైన్డ్ భూముల విషయంలో అన్ని పార్టీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొందామని ఆయన చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం అనేక మంచి కార్యక్రమాలను చేపట్టినందుకు తమ ప్రభుత్వాన్ని సభలో మల్లుభట్టి విక్రమార్క అభినందించడం లేదన్నారు. కానీ ప్రైవేట్ సంభాషణల్లో మాత్రం తమ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారని కేసీఆర్ చమత్కరించారు.