తెలంగాణలో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదు: హుజూర్ నగర్ సభలో కేసీఆర్
తెలంగాణలో మూడో దఫా అధికారంలోకి వస్తామని కేసీఆర్ ధీమాను వ్యక్తం చేశారు. హూజుర్ నగర్ లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు.
హుజూర్ నగర్: రాష్ట్రంలో తాము మూడో దఫా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. కాంగ్రెస్ ఎట్టిపరిస్థితుల్లో అధికారంలోకి రాదని ఆయన తేల్చి చెప్పారు.
మంగళవారంనాడు హుజూర్ నగర్ లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రసంగించారు. అధికారంలోకి వచ్చే పరిస్థితి లేకున్నా కాంగ్రెస్ లో సీఎం పోస్టుకు పోటీ పడే నేతలు ఎంతో మంది ఉన్నారన్నారు.
పార్టీల చరిత్ర, వైఖరి, థృక్పథం ఏమిటో తెలుసుకోవాలని ఆయన ప్రజలను కోరారు.ఓటు వేసే ముందు ప్రజలు ఆలోచించాలని ఆయన కోరారు. తలరాత, భవిష్యత్తును ఓటు నిర్ధేశిస్తుందని కేసీఆర్ చెప్పారు.ప్రజాస్వామ్యంలో ఓటు అనేది బ్రహ్మండమైన ఆయుధమని కేసీఆర్ తెలిపారు. పార్టీల చరిత్ర, వైఖరిని చూసి ఓటు వేయాలని ఆయన కోరారు.
1956లో తెలంగాణను ఏపీలో కలపాలనే ప్రతిపాదనను ఆనాడు విద్యార్ధులు, ఉద్యోగులు వ్యతిరేకించిన విషయాన్ని కేసీఆర్ ప్రస్తావించారు. ఇడ్లీ, సాంబార్ గో బ్యాక్ ఉద్యమ సమయంలో కాల్పులు జరిగిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు.ఈ కాల్పుల్లో ఏడుగురు చనిపోయారన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో తెలంగాణకు పైసా ఇవ్వబోమని కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటిస్తే తెలంగాణలోని కాంగ్రెస్ నేతలు నోరు మెదపలేదని ఆయన విమర్శించారు. పదవులు, కాంట్రాక్టుల కోసం ఆనాడు కాంగ్రెస్ నేతలు మాట్లాడలేదన్నారు. ప్రజల బాధలు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు అక్కర్లేదన్నారు.
1956లో కాంగ్రెస్ చేసిన పొరపాటుకు దశాబ్దాల తరబడి బాధపడ్డామని కేసీఆర్ తెలిపారు. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ ఇచ్చుడో అని తాను ఆమరణ నిరహార దీక్ష చేపడితేనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్ తలవొగ్గిందని కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ రైతులకు మూడు గంటల పాటు విద్యుత్ మాత్రమే సరిపోతుందని కొందరు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారన్నారు. వ్యవసాయానికి 24 గంటల పాటు విద్యుత్ కావాలంటే బీఆర్ఎస్ కు ఓటేయాలని కేసీఆర్ కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదన్నారు. సీఎం రేసులో అనేక మంది ఉన్నారన్నారు. కాంగ్రెస్ నేతల మాయమాటలను నమ్మవద్దని కేసీఆర్ ప్రజలను కోరారు.
ఏం తెలుసునని ధరణిని ఎత్తివేయాలని రాహుల్ గాంధీ కొరుతున్నారని ఆయన ప్రశ్నించారు.రైతుల గురించి ఏనాడూ ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన చెప్పారు.