అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాల భర్తీ: భూపాలపల్లిలో రేవంత్ రెడ్డి
పాదయాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి విద్యార్ధులతో ఇవాళ సమావేశమయ్యారు. విద్యపై 10 శాతం నిధులను కేటాయించనున్నట్టుగా రేవంత్ రెడ్డి హమీ ఇచ్చారు.
భూపాలపల్లి: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని విద్యా సంస్థల్లో రైట్ టూ ఎడ్యుకేషన్ యాక్ట్ అమలయ్యేలా పాలసీని రూపొందించనున్నట్టుగా రేవంత్ రెడ్డి ప్రకటించారు. హత్ సే హత్ జోడో అభియాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారంనాడు భూపాలపల్లిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విద్యార్ధులతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో ఆయన విద్యార్ధులతో మాట్లాడారు.
కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రైట్ టూ ఎడ్యుకేషన్ యాక్ట్ ను తీసుకు వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ సర్కార్ ఈ చట్టాన్ని అమలు చేయడం లేదన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో కూడా ఈ చట్టం ద్వారా పేదలకు 25 శాతం సీట్లను ఉచితంగా కేటాయించాలని చట్టం చెబుతుందన్నారు.. కానీ తమ ప్రభుత్వం ఈ చట్టం అమలయ్యేలా పాలసీని రూపొందించనుందని రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యార్ధులకు ఫీజు రీ ఎంబర్స్ మెంట్ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
తెలంగాణ ఉద్యమంలో నమోదైన కేసులను ఎత్తివేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యపై ప్రభుత్వం చేసే ఖర్చు పెట్టుబడి అని రేవంత్ రెడ్డి చెప్పారు. విద్యకు 10 శాతం నిధులను ఖర్చు చేస్తామని రేవంత్ రెడ్డి హమీ ఇచ్చారు. హస్టళ్లలో కూడా సౌకర్యాలను కూడా మెరుగుపర్చేలా కాగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించనుందని రేవంత్ రెడ్డి వివరించారు.
ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలపై బిశ్వాల్ కమిటీని కేసీఆర్ ప్రభుత్వం నియమించిందన్నారు. 1.91 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలున్నాయని కమిటీ చెప్పిందన్నారు. రాష్ట్రంలో ఐదు లక్షల ఉద్యోగులుంటే ఇందులో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీలున్నాయని రేవంత్ రెడ్డి చెప్పారు. ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును పెంచి కొత్త ఉద్యోగాల ప్రకటన రాకుండా కేసీఆర్ సర్కార్ చేసిందని రేవంత్ రెడ్డి విమర్శించారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని రేవంత్ రెడ్డి హమీ ఇచ్చారు. ప్రతి ఏటా ఖాళీ అయిన ప్రభుత్వ ఉద్యోగ పోస్టులను భర్తీ చేస్తామని రేవంత్ రెడ్డి హమీ ఇచ్చారు.