ఆయిల్ ఫామ్ పంటలు సాగు చేసేలా రైతులకు ప్రోత్సాహం:కేటీఆర్


ఆయిల్  ఫామ్  పంటల సాగుపై  రైతులను  ప్రోత్సహిస్తున్నామని  తెలంగాణ  మంత్రి కేటీఆర్ చెప్పారు.రాష్ట్రంలో అనుకూల  వాతావరణం  ఉన్న  ప్రాంతాల్లో  వరి కాకుండా ఇతర పంటలను  పండించేలా ప్రోత్సహిస్తామని కేటీఆర్  తెలిపారు.

We  will  encourages  on palm oil cultivation: KTR

హైదరాబాద్: వరితో పాటు  ఆయిల్ ఫామ్ , వేరుశనగ , సోయాబీన్  వంటి  పంటల సాగుకు  రైతులను ప్రోత్సహిస్తున్నామని  తెలంగాణ మంత్రి కేటీఆర్  చెప్పారు.శుక్రవారంనాడు  హైద్రాబాద్  లో  భారత వెజిటబుల్ ఆయిల్ ప్రొడక్షన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  నూనెగింజల సాగు, ఉత్పత్తి పరిశ్రమల అభివృద్ధిపై సదస్సు  జరిగింది.  ఈ సదస్సులో  మంత్రి  కేటీఆర్  పాల్గొన్నారు. 

భిన్నత్వంలో  ఏకత్వం  భారత్ ప్రత్యేకత  అని  తెలంగాణ మంత్రి  కేటీఆర్ చెప్పారు.  ఎనిమిదేళ్లలో  రాష్ట్రంలో  అటవీ  విస్తీర్ణం  7  శాతం  పెరిగిందన్నారు  మంత్రి.రాష్ట్రంలో  ఆయిల్ ఫామ్  సాగును  పెద్ద  ఎత్తున ప్రొత్సహిస్తున్నామని  మంత్రి  తెలిపారు. కేసీఆర్ తీసుకువచ్చిన  విధానాల  కారణంగా  రాష్ట్రంలో  సాగు  విస్తీర్ణం  భారీగా  పెరిగిన  విషయాన్ని మంత్రి  గుర్తు చేశారు. హైద్రాబాద్  లో  లైఫ్ సైన్సెస్ రంగం పురోగమిస్తుందన్నారు.

తెలంగాణలో  పరిశ్రమలు  పెట్టాలంటే  ఎవరినీ కలవాల్సిన  అవసరం  లేదన్నారు  మంత్రి.ఆన్ లైన్  లో ధరఖాస్తు  చేసుకొంటే  15 రోజుల్లో  పరిశ్రమకు  అనుమతి  వస్తుందని  మంత్రి  తెలిపారు.  16వ రోజున  పరిశ్రమలకు అనుమతి రాకపోతే  అధికారులకు ఫైన్  వేస్తామని  మంత్రి కేటీఆర్  గుర్తు చేశారు.

తెలంగాణ  రాష్ట్రంలో  నాలుగేళ్లలోనే  కాళేశ్వరం  ప్రాజెక్టును నిర్మించిన  విషయాన్ని  కేటీఆర్  ప్రస్తావించారు. తెలంగాణ  ప్రభుత్వం  ప్రపంచంలోనే  అతిపెద్ద  లిఫ్ట్  ఇరిగేషన్ ప్రాజెక్టు  కాళేశ్వరాన్ని పూర్తి చేసిందన్నారు.25.9 మిలియన్ మెట్రిక్ టన్నుల  ధాన్యాన్ని  రాష్ట్రంలో  ఉత్పత్తి చేసినట్టుగా  మంత్రి  కేటీఆర్  వివరించారు. 

రెండు మిలియన్  ఎకరాల్లో  రాష్ట్రంలో రైతులు  వరిని పండిస్తున్నారని  మంత్రి కేటీఆర్  చెప్పారు. రానున్న  రోజుల్లో  వీరిలో కొందరు  రైతులను  ఆయిల్ ఫామ్  సాగు వైపునకు  మళ్లించనున్నట్టుగా  కేటీఆర్  తెలిపారు. సోయాబీన్,  వేరుశనగ, వంటి  పంటలను కూడా  ఆయా జిల్లాల్లో  పండించేందుకు  రైతులను ప్రోత్సహిస్తున్నట్టుగా  మంత్రి  వివరించారు.ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరిందన్నారు. ఇందులో ఇండియా, చైనాల జనాభానే  ఎక్కువగా ఉందన్నారు. ఏటా ప్రపంచ జనాభాకు 220 మిలియన్ టన్నుల నూనెగింజలు అవసరమౌతుందని  మంత్రి తెలిపారు.

భారతదేశంలో నూనె గింజల వినియోగం ఏటా 20 నుండి 22 మిలియన్ టన్నులుగా  ఉంటుందని  కేటీఆర్ చెప్పారు. ఏటా రూ.90 వేల నుండి లక్ష కోట్లు వెచ్చించి కావాల్సిన నూనెగింజలు దిగుమతి చేసుకుంటున్ప  విషయాన్ని  కేటీఆర్  ప్రస్తావించారు. మన దేశంలో ప్రతి ఏటా సగటున 19 కిలోల వంటనూనెలు వినియోగిస్తున్నారని  మంత్రి తెలిపారు. రాష్ట్రంలో గత ఏడాది వరకు 50 వేల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగవుతుందన్నారు. రానున్న  రోజుల్లో  ఈ  విస్తీర్ణం  మరింత  పెంచనున్నట్టుగా  కేటీఆర్  తెలిపారు. 

 

తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి వసతి పెరిగిందన్నారు. రాష్ట్రంలోని 25 జిల్లాలలో ఆయిల్ పామ్ సాగుకు అనుకూలంగా  ఉందని కమిటీ  నివేదిక  ఇచ్చిన  విషయాన్ని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలోని 25 జిల్లాలను 11 కంపెనీలకు కేటాయించామన్నారు. ఆయిల్ పామ్ నర్సరీలు, ఇతర సౌకర్యాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నట్టుగా  కేటీఆర్  వివరించారు.రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టుగా  కేటీఆర్  తెలిపారు. దేశంలో 70 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగుకు అవకాశం ఉన్నదని కేంద్ర నివేదికలు వెల్లడిస్తున్నాయన్నారు.  తెలంగాణలో రాబోయే మార్చి నాటికి 1.78  లక్షల ఎకరాలలో  ఆయిల్  ఫామ్ సాగు లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని  మంత్రి  వివరించారు. 

ఆచరణాత్మక, వ్యూహాత్మక నాయకుడు  కేసీఆర్ అని  కేటీఆర్  చెప్పారు.ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుత రాజకీయ నేతలలో అందరిలో దార్శనికత గల నేత కేసీఆర్  అని  ఆయన  తెలిపారు.  ఎనిమిదేళ్ల కేసీఆర్  పాలన దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రతి ఎకరానికి సాగునీరు మూలంగా  సాగు విస్తీర్ణం, పంటల ఉత్పత్తి , నాణ్యమైన దిగుబడులు పెరిగినట్టుగా  ఆయన  తెలిపారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెరుగైనట్టుగా  ఆయన  వివరించారు. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios