వచ్చే ఎన్నికల్లో  తెలంగాణలోని  అన్ని స్థానాల్లో  పోటీ చేయనున్నట్టు  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రకటించారు.


హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని స్థానాల్లో పోటీ చేయనున్నట్టు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రకటించారు. 
మంగళవారం నాడు ఆయన తెలంగాణలో పార్టీ పరిస్థితిపై స్పందించారు. తెలంగాణలోని పొత్తుల విషయమై పొలిట్ బ్యూరో చూసుకొంటుందని ఆయన చెప్పారు.

తెలంగాణలో టీడీపీ బలంగా ఉందన్నారు. తెలంగాణలో మహాకూటమి ఏర్పాటుతో పాటు కాంగ్రెస్,టీడీపీల మధ్య పొత్తు విషయమై ప్రచారం సాగుతున్న నేపథ్యంలో లోకేష్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి.

తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే విషయమై పనిచేయాలని తెలంగాణలోని పార్టీ నేతలకు చంద్రబాబునాయుడు ఆదేశాలు ఇచ్చారు. అయితే ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోవాలనే విషయమై తనకు వదిలేయాలని.... ఎన్నికల సమయంలోనే పొత్తుల విషయమై చర్చిద్దామని చంద్రబాబునాయుడు తెలంగాణ నేతలకు గతంలోనే చెప్పారు.

తెలంగాణలో నాయకులు టీడీపీని వీడినా కార్యకర్తలు మాత్రం వీడలేదని, క్యాడర్ చెక్కుచెదరలేదని అన్నారు. కుంభకోణాలు చేసే వారికి ఏ అభివృద్ధి అయినా కుంభకోణంలానే కనిపిస్తుందన్నారు. 

 ఆరోపణలు చేయడం చాలా సులభమని, ప్రతిపక్షాలు చేసే అసత్య ఆరోపణల వల్ల ఏపీలో పరిశ్రమలు పెట్టాలనుకునే వారు భయపడే పరిస్థితి నెలకొని ఉందని అన్నారు. 

అసత్య ఆరోపణలు చేసే ప్రతిపక్షాలను సాక్ష్యాలు ఉంటే చూపమని నాలుగు నెలల నుంచి అడుగుతూనే ఉన్నానని, ఎన్నిసార్లు అడిగినా ఆధారాలు చూపలేకపోతున్నారని అన్నారు.