ఈటలకు ఎదురుదెబ్బ: టీఆర్ఎస్‌లోనే ఉంటామన్న హుజూరాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్
మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు హుజూరాబాద్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. తామంతా టీఆర్ఎస్‌లోనే ఉంటామని స్థానిక ప్రజా ప్రతినిధులు తేల్చిచెప్పారు.
హుజూరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు హుజూరాబాద్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. తామంతా టీఆర్ఎస్‌లోనే ఉంటామని స్థానిక ప్రజా ప్రతినిధులు తేల్చిచెప్పారు.హుజూరాబాద్ మున్సిపల్ ఛైర్‌పర్సన్ రాధిక, వైస్ ఛైర్మెన్ నిర్మల, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రమ తదితరులు శుక్రవారం నాడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తామంతా టీఆర్ఎస్‌లోనే ఉంటామన్నారు. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ ను వీడినా తామంతా పార్టీలోనే ఉంటామని చెప్పారు. టీఆర్ఎస్ బీ ఫాంపైనే తాము విజయం సాధించామని టీఆర్ఎస్ లోనే కొనసాగుతామన్నారు. తమ నాయకుడు కేసీఆర్ అని వారు చెప్పారు.
ఇటీవలనే హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ ముఖ్య నేతలతో తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లయిస్ శాఖ మంత్రి గంగుల కమలాకర్ సమావేశమయ్యారు. ఈటల రాజేందర్ వెంట ఎవరూ కూడ నేతలు వెళ్లకుండా టీఆర్ఎస్ నాయకత్వం జాగ్రత్తలు తీసుకొంటుంది. ఈ సమావేశం తర్వాత ఇవాళ హుజూరాబాద్ కు చెందిన టీఆర్ఎస్ ముఖ్య నేతలు శుక్రవారం నాడు సమావేశమయ్యారు. ఈ సమావేశం నిర్వహించిన తర్వాత మున్సిపల్ ఛైర్మెన్ రాధిక తదితరులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి టీఆర్ఎస్ లోనే కొనసాగుతామని ప్రకటించారు. అంతేకాదు టీఆర్ఎస్ లోనే కొనసాగుతామని తీర్మానం చేశారు.
also read:మంత్రివర్గం నుండి తప్పించడంతో సానుభూతి, నిలుపుకో: ఈటలతో డిఎస్
టీఆర్ఎస్ కు చెందిన ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలు ఎవరూ కూడ ఈటల రాజేందర్ వెంట వెళ్లకుండా గులాబీ పార్టీ నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈటల వెంట తిరిగిన నేతలకు నోటీసులు జారీ అయ్యాయి. ఈటల వెంట ఉన్న సింగిల్ విండో ఛైర్మెన్ కు గతంలో నోటీసులు జారీ కావడంతో కొందరు నేతలు అప్రమత్తమయ్యారు. మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేసిన ఈటల రాజేందర్ హుజూరాబాద్ కు వెళ్లారు. తన అనుచరులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశం నిర్వహించిన తర్వాత ఆయన హైద్రాబాద్‌కు తిరిగి వచ్చారు. పలు పార్టీల కీలక నేతలతో ఈటల సమావేశమౌతున్నారు.