Asianet News TeluguAsianet News Telugu

ముందస్తు ఎన్నికలకు సిద్దం: కేటీఆర్ సవాల్ పై బండి సంజయ్

రాష్ట్రంలో  అభివృద్ది, ఆదాయంపై  శ్వేతపత్రం విడుదల చేయాలని  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్  చేశారు.  ముందస్తు  ఎన్నికలకు తాము సిద్దమని  ఆయన  స్పష్టం  చేశారు.  
 

We Ready for Early Elections in Telangana: BJP Telangana President Bandi sanjay
Author
First Published Jan 29, 2023, 1:34 PM IST

హైదరాబాద్: ముందస్తు  ఎన్నికలకు తాము సిద్దంగా  ఉన్నామని  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు.  ముందస్తు  ఎన్నికలకు బీజేపీ జాతీయ నాయకత్వం  సిద్దంగా  ఉందా అని  తెలంగాణ మంత్రి కేటీఆర్  సవాల్  చేశారు.ఈ సవాల్ పై  బండి సంజయ్  స్పందించారు.  ఆదివారం నాడు  బండి సంజయ్  కరీంనగర్ లో  మీడియాతో మాట్లాడారు.  ముందస్తు  ఎన్నికల విషయమై  తన తండ్రి కేసీఆర్ తో  ప్రకటన చేయించాలని  మంత్రి కేటీఆర్ ను కోరారు. బండి సంజయ్.  ఎన్నికలు  ఎప్పుడొచ్చినా  తాము సిద్దంగా  ఉన్నామన్నారు.  

రాష్ట్రంలో  ముందస్తు  ఎన్నికలు వచ్చినా, నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగినా తాము సిద్దంగా  ఉన్నట్టుగా  బండి సంజయ్  చెప్పారు.  ఈ విషయమై తాను ఏడాది క్రితమే  ప్రకటన చేసిన విషయాన్ని ఆయన గుర్తు  చేశారు.  తమ పార్టీలో  కోవర్టులుండరని ఆయన  చెప్పారు. రాష్ట్రంలో  అభివృద్ది,  ఆదాయంపై  శ్వేతపత్రం  విడుదల చేయాలని  కేసీఆర్ సర్కార్  ను  బండి సంజయ్  కోరారు.

also read:నిజామాబాద్‌లో కేటీఆర్ పర్యటన.. కాన్వాయ్‌ను అడ్డుకున్న బీజేపీ శ్రేణులు, ఉద్రిక్తత

తెలంగాణ లో 24 గంటల విద్యుత్  ను  ఎక్కడ ఇస్తున్నారని ఆయన  ప్రశ్నించారు.24 గంటల  విద్యుత్  ఇస్తున్నట్లు నిరూపిస్తే  తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని చెప్పారు. తన సవాల్ కు  కేసీఆర్ సిద్ధమా? అని  ఆయన అడిగారు.   కరెంట్ చార్జీల పెంపుతో మరో రూ.16 వేల కోట్ల భారం ప్రజలపై మోపేందుకు కేసీఆర్ సర్కార్ సిద్దంగా  ఉందని  బండి సంజయ్ ఆరోపించారు.  ఏసీడీ చార్జీల ను  ప్రజలు చెల్లించవద్దన్నారు.  మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయా అని ఆయన ప్రజలను ప్రశ్నించారు.  కేసీఆర్ సీఎం అయ్యాకే వలసలు ఎక్కువ అయ్యాయన్నారు. దుబాయ్ లో  చనిపోయిన వారి శవాలు కూడా తీసుకురాలేక పోయారన్నారు. 

కేసీఆర్ నోరు తెరిస్తే బూతులేనన్నారు.కేసీఆర్ ది మూర్కపు పాలనగా  ఆయన పేర్కొన్నారు.  కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణ వాటా ఎంత మనం వాడుకున్నది ఎంత అని  ఆయన అడిగారు. తెలంగాణ రాష్ట్ర వాటాను ఇతర  రాష్ట్రం తీసుకెళ్తుంటే  ఏం చేశారని  ఆయన కేసీఆర్ ను ప్రశ్నించారు. కృష్ణా, గోదావరిలో మన వాటా నీటినే వాడుకోవడం చేతగాని కేసీఆర్ దేశం గురించి మాట్లాడుతున్నారని ఆయన  ఎద్దేవా చేశారు.  ప్రజలు ఆదాయం ఇస్తుంటే ఒక్కో కుటుంబంపై రూ.6 లక్షల అప్పులను  కేసీఆర్ బహుమతిగా  ఇచ్చాడన్నారు. 

రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ 4వ స్థానంలో ఉందన్నారు.   రాష్ట్రంలో  ఆత్మహత్యలే లేవని కేసీఆర్ సర్కార్  చెప్పడం సిగ్గు చేటని ఆయన చెప్పారు.  దళితుడిని సీఎం చేయడం ఎంత నిజమో రైతులను ఎమ్మెల్యేలను చేస్తాననడం అంతే నిజమని ఆయన ఎద్దేవా చేశారు.  ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల పక్షాన ఆందోళన చేస్తున్న యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాశ్ ను పోలీసులు ఎలా కొట్టారో ప్రపంచం చూసిందన్నారు. . ప్రజల పక్షాన పోరాడుతున్న బీజేపీ నాయకులను, మోర్చాల నాయకులను బీఆర్ఎస్ సర్కార్  టార్గెట్ చేసిందని ఆయన  విమర్శించారు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని కేసీఆర్ 317 జీవో పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. . ఇతర రాష్ట్రాల నాయకులకు పైసలిచ్చి బీఆర్ఎస్ లో కేసీఆర్ చేర్చకుంటున్నారని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios