టీఆర్ఎస్ విమర్శలకు కౌంటర్ ఇచ్చిన టీ జేఏసీ చైర్మన్
టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారం చేపట్టాక ప్రతిపక్షాల కంటే తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాంనే ఎక్కువగా టార్గెట్ చేస్తోంది.
ప్రభుత్వ పనితీరుపై ఆయన ప్రశ్నించిన ప్రతీసారి ఎదురుదాడికి దిగుతోంది. జేఏసీలోని నేతలను చీల్చడానికి కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తోందని పుకార్లు వస్తున్నాయి. అంతేకాదు కోదండరాంను కాంగ్రెస్ ఏజెంట్ గా కూడా గులాబీ నేతలు ఆరోపిస్తూనే ఉన్నారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత కోదండారం చాలా సార్లు రహస్యంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యారని వారు విమర్శలు గుప్పిస్తున్నారు.
నిన్నటిదాకా టీ జేఏసీలో కీలకపాత్ర పోషించి బహిష్కరణకు గురైన పిట్టల రవీందర్ కూడా కోదండరాంపై ఇదే తరహా విమర్శలు చేస్తుండటం గమనార్హం. సోనియా గాంధీతో ఎన్నిస్లార్లు భేటీ అయ్యారో కోదండరాం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
అయితే దీనిపై ఎట్టకేలకు టీ జేఏసీ చైర్మన్ నోరు విప్పారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు తెల్లకపల్లి రవి కి ఇచ్చిన ఇంటర్య్వూలో తాను రెండుసార్లు సోనియా గాంధీని కలిసినట్లు తెలిపారు. 2005 లో కేసీఆర్ తో కలసి సోనియా గాంధీ వద్దకు వెళ్లాలని అటు తర్వాత 2013 లో తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందాక కృతజ్జతలు చెప్పడానికి సోనియాగాంధీని కలిసినట్లు స్పష్టం చేశారు.
