హైదరాబాద్: బాగా మద్యం తాగి ఉన్నాం.. ఏం చేస్తున్నామో మాకే తెలియదు... ఉదయం నుండి రాత్రి వరకు ఖాళీగా కూర్చొని విసుగు పుట్టిందని జస్టిస్ ఫర్ దిశ (తెలంగాణ నిర్భయ) కేసులో నిందితులు పోలీసుల విచారణలో చెప్పారు.

ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే ఉన్న సర్వీస్ రోడ్డులో స్కూటీని ఆపిన జస్టిస్ ఫర్ దిశను లారీలో కూర్చొన్న ఈ నలుగురు నిందితులు చూశారు. అయితే అప్పటికే వాళ్లంతా మద్యం సేవించి ఉన్నారు. జస్టిస్ ఫర్ దిశ తన బైక్ ను పార్క్ చేసిన సమయంలో ఈ నిందితులకు దుర్బుద్ది పుట్టింది.

Also read:వైద్యురాలి పేరు వాడొద్దు... ఇకపై జస్టిస్ ఫర్ దిషాగా పిలవాలి: సీపీ సజ్జనార్

జస్టిస్ ఫర్ దిశ ఎంత ఆలస్యంగా వస్తే తమ పని అంత సులభంగా అవుతోందని భావించారు. ఈ నేపథ్యంలోనే జస్టిస్ ఫర్ దిశ బైక్ వెనుక టైర్ లో గాలిని తీసేశారు. చేతిలో డబ్బుంది,పని లేకుండా ఖాళీగా కూర్చొన్నాం... చేసేది లేక మద్యం తెచ్చుకొని లారీలోనే కూర్చొని తాగుతూ కూర్చొన్నట్టుగా నిందితులు పోలీసుల విచారణలో వెల్లడించారు.

పొద్దున నుండి లారీలో ఖాళీగా కూర్చొన్నాం... విసుగు పుట్టింది బైక్ పార్క్ చేస్తున్న యువతిని చూడగానే దుర్భుద్ది పుట్టిందని నిందితులు పోలీసుల విచారణలో ఒప్పుకొన్నారని తెలుస్తోంది.

Also Read:డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య: ఆ ముగ్గురూ పోకీరీలే, బైక్‌పై డేంజర్ సింబల్

రాత్రి 9 గంటల సమయంలో దిశ తన బైక్ వద్దకు వచ్చింది. ఆమె బైక్ వద్దకు రాగానే లారీలో నుండి దిగి బైక్ పంక్చర్ అయిందని చెప్పామని నిందితులు పోలీసులకు చెప్పారు. 

గతంలో తాను దొంగిలించిన ఇనుప కడ్డీలను విక్రయించేందుకు సహాయంగా రావాలని నవీన్ , చెన్నకేశవులను రావాలని ప్రధాన నిందితుడు ఆరీఫ్ పాషా పిలిచాడు. అయితే వారంతా నవంబర్ 26వ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు దొంగిలించిన ఇనుప కడ్డీలను విక్రయించారు. నవంబర్ 27న ఉదయం 9 గంటలకు తొండుపల్లి ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్ వద్ద లారీని నిలిపివేశారు. అదే రోజు సాయంత్రం ఐదున్నర గంటల నుండి ఈ నలుగురు మద్యం తాగడం ప్రారంభించారు.

మద్యం తాగడం వల్ల తాము ఏం చేస్తున్నామో కూడ తెలియని పరిస్థితిలో ఉన్నామని నిందితులు పోలీసుల విచారణలో చెప్పినట్టుగా తెలిసింది. అయితే బాధితురాలు బతికితే తమకు ఇబ్బంది అవుతోందని భావించి ఆమెను హత్య చేసి మృతదేహన్ని కాల్చేస్తే ఇబ్బంది ఉండదని భావించినట్టుగా నిందితులు పోలీసుల విచారణలో తెలిపారు.

దిశపై అత్యాచారానికి పాల్పడిన తర్వాత కూడ మద్యం తాగి మృతదేహన్ని కాల్చివేయాలని నిర్ణయం తీసుకొన్నామని నిందితులు పోలీసులకు వివరించారు.