హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని  సీఎల్పీ నేత జానారెడ్డి ధీమాను వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సీట్లు తమకు వస్తాయని  చెప్పారు. అయితే  అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ భావించడంలో ఏమైనా అర్ధం ఉందా అన్నారు.

శుక్రవారం నాడు ఆయన సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగబద్దంగా ఎన్నికైన ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగాలన్నారు.అయితే ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ వెళ్లాలని భావించడంలో అర్ధం ఉందా అడగాలని ఆయన మీడియాను కోరారు.. శాంతి భద్రతల సమస్యలు, ఇతరత్రా ఏదైనా సమస్యలు చోటు చేసుకొంటేనే ముందస్తు ఎన్నికలకు వెళ్లిన ఘటనలు ఉన్నాయని  ఆయన గుర్తు చేశారు. 

కానీ, తెలంగాణలో ఆ రకమైన పరిస్థితులు లేవన్నారు. అయితే ముందస్తు ఎన్నికల విషయంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి  గతంలో చేసిన ప్రకటనే  పార్టీ నిర్ణయంగా ఆయన చెప్పారు.

ఐదేళ్ళకు ఒకసారి ఏర్పడాల్సిన ప్రభుత్వం... ఆర్నెళ్లకు ఓసారి ఎన్నికలకు వెళ్తోందా అని జానారెడ్డి ప్రశ్నించారు.  తెలివైన ప్రభుత్వం ఉంటే రాష్ట్రంలో ఈ సమస్య వచ్చేది కాదన్నారు. అయితే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్దంగా ఉన్నామని జానారెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించనుందని ఆయన  చెప్పారు.

ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరితే ముందస్తు ఎన్నికలకు సిద్దమా అని తమను కేసీఆర్ ప్రశ్నించడాన్ని ఆయన తప్పుబట్టారు.  వచ్చే ఎన్నికల్లో  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.అయితే ఎన్ని సీట్లు సాధిస్తోందనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. మెజారిటీ సీట్లు దక్కితేనే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది కదా అని జానా మీడియాను ప్రశ్నించారు.

అయితే కర్ణాటకలో  జేడీఎస్ కూడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని అలాంటి సందర్భాలు చోటు చేసుకొంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ గద్వాల జిల్లాలో పర్యటన సందర్భంగా ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ను హౌజ్ అరెస్ట్ చేయడం సరైంది కాదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క చెప్పారు. సంపత్ కుమార్ ను వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు.