హైదరాబాద్: ప్రభుత్వంతో చర్చలకు తాము సిద్దంగా ఉన్నామని ఆర్టీసీ జేఎసీ కన్వీసర్ ఆశ్వథామరెడ్డి తెలిపారు. ప్రభుత్వానికి కార్మికులకు మధ్య చర్చలకు మధ్యవర్తిత్వం వహించాలని  ఆయన కోరారు.

సోమవారం నాడు ఓ తెలుగు మీడియా న్యూస్ ఛానెల్‌కు ఆశ్వథామ రెడ్డి ఇంటర్వ్యూ ఇచ్చారు. కొంత మంది మంత్రులు ఆర్టీసీ కార్మికులను  రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని  ఆయన చెప్పారు. 2015లో ఎర్రబెల్లి దయాకర్ రావు ఏం మాట్లాడారు, మంత్రి పదవిని చేపట్టిన తర్వాత దయాకర్ రావు ఏం మాట్లాడారో  అందరికీ తెలుసునని ఆశ్వథామ రెడ్డి విమర్శించారు.

టీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు  కారం రవీందర్ రెడ్డితో ఆర్టీసీ సమ్మె గురించి  తాను ముందుగానే సమాచారం ఇచ్చినట్టుగా ఆయన తెలిపారు.టీఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డికి తాము ఫోన్ చేశామో లేదో కాల్ డేటా తీస్తే తెలిసే అవకాశం ఉందన్నారు. కాల్ డేటా తీయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఆర్టీసీ బస్ భవన్  ముందు ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటామని కూడ టీఎన్జీఓ నేతలు తమకు హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.  టీఎన్జీఓ సమావేశం ఏర్పాటు చేసిన రోజునే వారంతా  సీఎంతో సమావేశమయ్యారని  ఆశ్వథామ రెడ్డి చెప్పారు. సీఎంతో టీఎన్జీఓ నేతలు సమావేశం కావడంలో తప్పు లేదన్నారు.

టీఎన్‌జీఓ నేతలతో మరోసారి సమావేశం కానున్నట్టుగా ఆయన తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆర్టీసీ కార్మికులు ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాటం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కేశవరావు లాంటి నేత  చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తే తమకు అభ్యంతరం ఉండదన్నారు. సమ్మె కొనసాసగిస్తూనే చర్చలకు వెళ్తామన్నారు. సమ్మె విరమించి చర్చలు ఎలా వెళ్తామని ఆయన ప్రశ్నించారు. తాము ప్రకటించిన ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తామని ఆయన ప్రకటించారు.

ఆర్టీసీ కార్మికుల జేఎసీ ఈ నెల 19వ తేదీన  తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చింది.ఈ బంద్ కు పలు రాజకీయ పార్టీలు మద్దతును ప్రకటించాయి.బంద్ తర్వాత భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించే అవకాశాలున్నాయి. 

ఆర్టీసీ కార్మికులు చర్చలకు సిద్దం కావాలని సోమవారం నాడు ఉదయం టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు చేసిన వినతి మేరకు ఆశ్వథామరెడ్డి స్పందించారు. ఆర్టీసీ కార్మికులు ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడడంపై కేశవరావు సోమవారం నాడు ప్రకటన విడుదల చేశారు. 

కేశవరావు ప్రకటనపై ఆశ్వథామరెడ్డి స్పందించారు. చర్చలకు  తాము సిద్దంగా ఉన్నామని తేల్చి చెప్పారు. కానీ, ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన వస్తోందోననే  ఆసక్తి సర్వత్రా నెలకొంది.