హైదరాబాద్: తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో అనేక దుష్ప్రచారాలు చేశారని తెలంగాణ మంత్రి కేటీఆర్ చెప్పారు.  కానీ ఆరేళ్ల తర్వాత భారతదేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా చేసిన ఘనత కేసీఆర్ కే దక్కిందన్నారు.

తెలంగాణ మంత్రి కేటీఆర్ తో గురువారం నాడు నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. .జీహెచ్ఎంసీ ఎన్నికలను పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో హైద్రాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో అనిశ్చిత పరిస్థితి నెలకొందన్నారు.

హైద్రాబాద్ పై అనేక అసత్య ప్రచారాలు చేశారన్నారు. కొత్త పెట్టుబడులు రావు, ఉన్న కంపెనీలు కూడ తరలిపోతాయని ప్రచారం చేశారని చెప్పారు. తెలంగాణ వస్తే  చీకటి వస్తోందని ప్రచారం చేశారన్నారు. ప్రాంతీయ విద్వేషాలు వస్తాయని ప్రచారం జరిగిందన్నారు.

రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన ఆరున్నర ఏళ్ల తర్వాత భారత దేశం మొత్తమంతా తెలంగాణ వైపు చూసేలా చేశామన్నారు. దీనికి కేసీఆర్ కారణమని ఆయన చెప్పారు.

తెలంగాణ వస్తే చీకటి అవుతోందన్నారు. కానీ నిరంతర విద్యుత్ ను సరఫరా చేస్తున్నామన్నారు. గతంలో పవర్ హాలిడే ఉందన్నారు. విద్యుత్ లోటు నుండి మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిందన్నారు. 45 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉన్న స్థితి నుండి 5 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ కు చేరుకొన్నామని చెప్పారు.

శాంతిభద్రతలతో కూడిన  మహానగరం ఎలా ఉండాలో  అధ్యయనం చేసి పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని ఆయన తెలిపారు.

ఎస్ఆర్‌డీపీ ప్రోగ్రాం ద్వారా ఐదేళ్లలో ఎన్నో ఫ్లైఓవర్లు నిర్మించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.ఇవాళ తెలంగాణ ఇంత ప్రశాంతంగా ఉండడానికి కేసీఆర్ కారణమని ఆయన తెలిపారు.

మెరుగైన విద్య, ఉపాధి, వైద్య సదుపాయాలను కల్పిస్తున్నట్టుగా ఆయన చెప్పారు. నగరంలో ఐదు ప్రముఖ కంపెనీలు  ఈ ఆరేళ్ల కాలంలో వచ్చాయని ఆయన వివరించారు.నగరంలో పేదలకు లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించామన్నారు. దేశంలో ఏ నగరంలో కూడ  లేవన్నారు.

ఆరేళ్ల కాలంలో ఆస్తిపన్ను, నీటి పన్ను, విద్యుత్ చార్జీలు,రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచామా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను అందిస్తున్నామని ఆయన వివరించారు. హైద్రాబాద్ నగరంలో అభివృద్ధి కోసం ఖర్చు పెట్టిన ప్రతి పైసాను త్వరలోనే విడుదల చేస్తామని ఆయన చెప్పారు.