హైదరాబాద్: టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ చెప్పినట్లే అన్నీ చేశామని బోయిన్ పల్లి కిడ్నాప్ కేసు నిందితులు బోయ సంపత్ కుమార్, మల్లికార్డున్ రెడ్డి పోలీసులకు చెప్పారు. వారిద్దరిని పోలీసులు బుధవారంనాడు తమ కస్టడీలోకి తీసుకుని విచారించారు. 

గుంటూరు శ్రీను మిత్రులంటూ విజయవాడ నుంచి వచ్చినవారికి కూకట్ పల్లిలోని లాడ్జిలో గదులు తీసిచ్చాంమని, మేడం చెప్పడంతో చెన్నయ్యతో కలిసి బైక్ మీద ప్రవీణ్ రావు ఇంటి వద్దకు నాలుగైదు సార్లు వెళ్లామని వారు చెప్పారు. 

కిడ్నాప్ వ్యవహారంలో అఖిలప్రియ సూత్రధారిగా వ్యవహరించారని, మిగతా విషయాలు తమకు తెలియవని వారు చెప్పారు. వారిని గురువారం మరింతగా లోతుగా విచారించనున్నారు. 

ఈ నెల 5వ తేదీన ప్రవీణ్ రావు సోదరులను కిడ్నాప్ చేసిన తీరును తెలుసుకునేందుకు గురువారం నిందితులను ఘటనా స్థలానికి తీసుకుని వెళ్లి సీన్ రీకన్ స్ట్రక్ట్ చేయనున్నారు. బాధితులను ఏ కారులో తీసుకుని వెళ్లారు, మధ్యలో ఎక్కడైనా ఆగారా, వారితో సంతకాలు చేయించుకునేందుకు ఎలా బెదిరించారు అనే విషయాలపై వారిని ప్రశ్నించనున్నారు. 

ఈ కేసులో వారిద్దరి పాత్రతో పాటు ఇతర నిందితులకు వారు ఎలా సహకరించారనే విషయాలను తెలుసుకోవడానికి విచారణ చేయాలని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.