మద్యం మత్తులో విద్యార్థులు చితకబాదాడు ఓ హాస్టల్ వాచ్‌మెన్. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌లోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో దౌల్తాబాద్‌కు చెందిన పవన్ కల్యాణ్ గౌడ్, నిజాంపేటకు చెందిన విష్ణుతేజ 9వ తరగతి చదువుతున్నారు.

వీరు శనివారం రాత్రి 10.30 ప్రాంతంలో మూత్ర విసర్జన కోసం బయటకు వచ్చారు. ఆ పాఠశాలకు వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న శంభులింగం అప్పటికే ఫూటుగా మద్యం సేవించి, మత్తులో ఊగుతున్నాడు. అతనికి తారసపడిన వీరిని ఇష్టమొచ్చినట్లు తిట్టి, వాతలు పడేలా కొట్టాడు.

పవన్ కల్యాణ్‌ స్వగ్రామం దౌల్తాబాద్ కావడంతో అతను వెళ్లి ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో వారు వచ్చి విద్యార్థులను ఆస్పత్రికి తరలించి, వాచ్‌మెన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. శంభులింగం ప్రతిరోజు మద్యం సేవించి విధులు నిర్వర్తిస్తున్నా ప్రిన్సిపాల్ కానీ ఇతర అధికారులు కానీ అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.