వరంగల్: వరంగల్ జిల్లాలో నగదు లావాదేవీలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎన్నికల్లో భారీగా ధన ప్రవాహం జరిగే అవకాశం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడే తనిఖీలు నిర్వహిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో డబ్బు పంపిణీపై ఎలాంటి సమాచారం వచ్చినా పోలీసులు, డాగ్ స్క్వాడ్ లు తనిఖీలు చేపడుతూ ముచ్చెమటలు పట్టిస్తున్నారు. అయితే అందులో భాగంగా వరంగల్ జిల్లా వర్థన్నపేట నియోజకవర్గం సిద్దార్థ నగర్ లో పోలీసులు సోదాలు నిర్వహించారు. 

ఈ సోదాల్లో రూ.3కోట్లు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. డబ్బుతోపాటు ఓటర్ స్లిప్పులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే సిద్ధార్థ్ నగర్ లోని మరో ఇంటిపైనా పోలీసులు సోదాలు నిర్వహించారు. భారీ స్థాయిలో నగదు లభించడంతో పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి వివరాలు రాబడుతున్నారు.