మెడికల్ విద్యార్ధిని ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసుకు సంబంధించి వరంగల్ మెడికల్ కాలేజ్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రీతిని వేధించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సైఫ్‌ను కాలేజ్ నుంచి సస్పెండ్ చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ వైద్య విద్యార్ధిని ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసుకు సంబంధించి పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ కేఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రీతిని వేధించిన సైఫ్‌ను కాలేజ్ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది యాజమాన్యం . అలాగే శిక్ష పడితే కాలేజ్ నుంచి బహిష్కరణ వేటు వేస్తామని తెలిపింది. ప్రీతి కేసుకు సంబంధించి వైద్యుల బృందం విచారణ పూర్తి చేసింది. అనంతరం నివేదికను సీల్డ్ కవర్‌లో డీఎంఈకి అందజేసింది. ఎంసీఐకి కూడా ఇదే నివేదికను పంపింది.
ఇటీవల కాకతీయ మెడికల్ కాలేజ్‌లో పీజీ ఫస్టియర్ చదువుతున్న ప్రీతి ఆత్మహత్యకు యత్నించిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. జనగామ జిల్లాకు చెందిన ప్రీతి.. వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ (అనస్థీషియా) చదువుతోంది. మహాత్మాగాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆస్పత్రిలో శిక్షణలో ఉన్న సమయంలో ఉదయం 6:30 గంటల ప్రాంతంలో విషపూరిత ఇంజక్షన్ వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ప్రీతిని అపస్మారక స్థితిలో ఉండటం గమనించిన ఆసుపత్రి సిబ్బంది సీనియర్ వైద్యులక సమాచారం అందించారు. వారు ఆమెను అత్యవసర వార్డుకు తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు.
ALso REad: ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల.. నిమ్స్ వైద్యులు ఏం చెప్పారంటే..
ఇక, సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపుల కారణంగానే ఆమె ఆత్మహత్య యత్నంచినట్టుగా పోలీసులు గుర్తించారు. సైఫ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు ర్యాగింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు చెప్పారు. ఈ క్రమంలోనే సైఫ్‌ను అదుపులోకి తీసుకున్నట్టుగా పోలీసులు ప్రకటించారు. శుక్రవారం సైఫ్‌ను హన్మకొండలోని కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం సైఫ్‌ను ఖమ్మం జైలుకు తరలించారు.
మరోవైపు.. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఈ రోజు ఉదయం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో.. ప్రీతి ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని తెలిపారు. ఎక్మో సపోర్టుతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని చెప్పారు. శుక్రవారం సీపీఆర్ నిర్వహించి గుండె పనితీరును మెరుగుపరిచినట్టుగా తెలిపారు. వైద్యుల బృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు.
