ప్రేమకు ప్రాంతాలు, దేశాలు, వర్ణం, కుల, మతాలు అడ్డుకాదని ఎన్నో జంటలు ఎన్నోసార్లు నిరూపించాయి. తాజాగా ఓ జంట దేశాల మధ్య హద్దు గోడలను తమ ప్రేమతో చెరిపేశారు. ఇద్దరి మనసులు కలవడంతో కుటుంబ పెద్దలను ఒప్పించి, వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్రం వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని పాపయ్యపేటకు చెందిన కంచ కృష్ణకాంత్‌ హైదరాబాద్‌లో ఉన్నత విద్యనభ్యసించి ఉద్యోగం కోసం 2002లో లండన్‌ వెళ్లారు. ఈ క్రమంలో పోలాండ్‌కు చెందిన బార్బర అనే యువతితో పరిచయం, ప్రేమగా మారింది.

అయితే దేశం, వేష భాషలు వేరైనా వీరిద్దరూ ధైర్యం కోల్పోలేదు. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించింది 2010లో హైదరాబాద్‌లో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు పదేళ్ల ఆరన్, అయిదేళ్ల నేతన్‌ ఇద్దరు కుమారులు. ప్రస్తుతం కృష్ణకాంత్‌ సోదరుడు నరేష్‌ కూడా ప్రేమ వివాహం చేసుకోవడం విశేషం.

ప్రస్తుతం నరేశ్ బ్రిటన్‌ పౌరసత్వం తీసుకుని అక్కడే స్థిరపడ్డాడు. ఈ సందర్భంగా కృష్ణకాంత్, బార్బర దంపతులు మాట్లాడుతూ... ప్రేమించడమే కాదు, పెద్దలను మెప్పించాలని పిలుపునిచ్చారు. ముందు ఒకరినొకరు పరస్పరం అర్థం చేసుకోవాలని.. అప్పుడే ఎవరికీ ఇబ్బందులు ఉండవు అని పేర్కొన్నారు.