హన్మకొండ:ఆర్టీసీ కార్మికుల ఆందోళన సమయంలో మహిళ ఉద్యోగి పట్ల  కాజీపేట ఏసీపీ అనుచితంగా వ్యవహరించారని విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ విషయమై వరంగల్ కమిషనర్ రవీందర్ వివరణ ఇచ్చారు. 

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో  ఆర్టీసీ కార్మికులు గురువారం నాడు హన్మకొండలో ఆందోళన నిర్వహించారు. ఈ సమయంలో  ఓ మహిళా  కండక్టర్ చీరేను కాజీపేట ఏసీపీ నర్సింగరావు లాగాడని మీడియాలో వార్తలు ప్రసారమయ్యాయి. అయితే ఈ విషయాన్ని ఏసీపీ పెద్దగా పట్టించుకోలేదు. లైట్ తీస్కోండి అంటూ వ్యాఖ్యానించారు.

అయితే మహిళ కండక్టర్ చీరను ఏసీపీ లాగాడని సోషల్ మీడియాలో, మీడియాలో పెద్ద ఎత్తున ప్రసారం కావడంతో పోలీసు శాఖలో స్పందన  మొదలైంది.ఈ విషయమై పోలీస్ శాఖ అంతర్గతంగా విచారణ చేసింది.

ఈ ఆందోళన సమయంలో ఏం జరిగిందనే విషయమై వీడియో దృశ్యాలను పరిశీలించింది. వీడియోలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈ ఘటనలో ఏసీపీ నర్సింగరావు తప్పు లేదని  వరంగల్ సిటీ కమిషనర్ రవీందర్ క్లీన్ చిట్ ఇచ్చారు. 

బాధిత మహిళ కొంగు జారిపోకుండా మరో మహిళ తన చేయితో పట్టుకొంది. ఆ సమయంలోనే ఏసీపీ వీరిద్దరి మద్యలోనే ఆందోళనకారులను పోలీస్ వ్యాన్‌లోకి ఎక్కించాడు. అయితే ఈ దృశ్యాలు ఒక వైపు నుండి చూస్తే ఏసీపీ వల్లే మహిళ కొంగు లాగినట్టుగా కన్పిస్తోంది. ఈ ఘటనను ఎదురుగా చిత్రీకరించిన వీడియోలో అసలు దృశ్యాలను వరంగల్ పోలీస్ శాఖ శుక్రవారం నాడు విడుదల చేసింది.

ఆర్టీసీ కార్మికుల ఆందోళన సమయంలో ఏం జరిగిందనే విషయమై పోలీసులు వీడియోతో పాటు కాజీపేట ఏసీపీకి క్లీన్ చిట్ ను ఇస్తూ ప్రకటనను విడుదల చేశారు. మహిళల పట్ల ఏసీపీ దురుసుగా ప్రవర్తించలేదని కూడ పోలీసు శాఖ ప్రకటించింది.