వరంగల్ కార్పోరేషన్ లో మరోసారి టీఆర్ఎస్ హవా కొనసాగింది. ఇటీవల నగర మేయర్ నన్నపునేని నరేందర్ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో మేయర్ పదవితో పాటు 19వ డివిజన్ కార్పోరేటర్ పదవికి కూడా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే ఇలా ఖాళీ అయిన కార్పోరేటర్ స్థానానికి ఎన్నికల కోసం ఇటీవలే నోటిఫికేషన్ వెలువడింది. అయితే ఎన్నికలేవీ లేకుండా ప్రత్యర్థులను ఒప్పించచడంలో ఎమ్మెల్యే నరేందర్ సఫలమవడంతో మరోసారి టీఆర్ఎస్ అభ్యర్థి దిడ్డి నాగరాజు ఏకగ్రీవంగా గెలుపొందారు. దీంతో వరంగల్ టీఆర్ఎస్ సంబరాల్లో మునిగిపోయింది. ఈ సందర్బంగా ఆ పార్టీ నాయకులు కార్పోరేషన్ కార్యాలయం వద్ద మిఠాయిలు పంచుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ఈ విజయంపై మాజీ మేయర్, ప్రస్తుతం వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మీడియాతో మాట్లాడారు. ఇలా కార్పోరేషన్ చరిత్రలో ఓ కార్పోరేటర్ ఏకగ్రీవంగా ఎన్నికవడం ఇదే మొదటిసారన్నారు. గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన 19వ డివిజన్ లోనే ఇలా టీఆర్ఎస్ కు చారిత్రాత్మక విజయం లభించడం చాలా సంతోషాన్నించ్చిందన్నారు. తమ  అభ్యర్థి ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరున ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. 

ఇదే విదంగా రానున్న లోక్ సభ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించేలా కృషిచేయాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా భారీ మెజారిటీతో ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుని  ఇటీవల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఇచ్చిన మాటను నిజం చేయాలని నరేందర్ నాయకులకు, కార్యకర్తలకు సూచించారు.