కొడుకు ముందే తండ్రిని కొట్టిన వనపర్తి పోలీసులు:రంగంలోకి కేటీఆర్
వనపర్తి జిల్లాలో లాక్‌డౌన్ నిబంధలను ఉల్లంఘించారనే నెపంతో పదేళ్ల కొడుకు ముందే ఒ వ్యక్తిని పోలీసులు విచక్షణ రహితంగా కొట్టారు. తన తండ్రిని కొట్టొద్దని ఆ పిల్లాడు వేడుకొంటున్నా కూడ పోలీసులు వినలేదు. తండ్రితో పాటు కొడుకును కూడ పోలీసులు వ్యాన్ ఎక్కించుకొని తీసుకెళ్లారు.
వనపర్తి: వనపర్తి జిల్లాలో లాక్‌డౌన్ నిబంధలను ఉల్లంఘించారనే నెపంతో పదేళ్ల కొడుకు ముందే ఒ వ్యక్తిని పోలీసులు విచక్షణ రహితంగా కొట్టారు. తన తండ్రిని కొట్టొద్దని ఆ పిల్లాడు వేడుకొంటున్నా కూడ పోలీసులు వినలేదు. తండ్రితో పాటు కొడుకును కూడ పోలీసులు వ్యాన్ ఎక్కించుకొని తీసుకెళ్లారు. ఈ ఘటనను రికార్డు చేసిన ఓ వ్యక్తి కేటీఆర్ కు ట్వీట్ చేశారు.
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో నిబంధనలను ఉల్లఘిస్తూ మోటార్ బైక్ తన పదేళ్ల కొడుకుతో ఓ వ్యక్తి రోడ్డుపైకి వచ్చాడు.నిబంధనలను ఉల్లంఘించారని ఆ వ్యక్తిని చితకబాదారు.
ఆ వ్యక్తిని కిందపడేసి కొట్టారు. పిడిగుద్దులతో విచక్షణ రహితంగా కొట్టారు. తన తండ్రిని వదిలిపెట్టాలంటూ ఆ కొడుకు కోరినా కూడ పట్టించుకోలేదు. ఆ పిల్లాడి ముందే బూతులు తిట్టారు. తండ్రి కొడుకులను పోలీస్ వ్యాన్ లో ఎక్కించారు.
ఈ తతంగాన్ని రికార్డు చేసి లక్ష్మణ్ అనే వ్యక్తి కేటీఆర్ కు ట్వీట్ చేశారు. ఈ వీడియో చూసిన మంత్రి కేటీఆర్ సీరియస్ గా స్పందించారు. ఈ తరహ ఘటనలు ఏ మాత్రం సమర్ధనీయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా సమయంలో ప్రజల కోసం పనిచేస్తున్న వేలాది మంది పోలీసులకు ఈ తరహ ఘటనలు చెడ్డపేరు తెచ్చే అవకాశం ఉందన్నారు.
ఈ విషయంలో కఠినమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డికి కేటీఆర్ రీట్వీట్ చేశారు. ఈ విషయమై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డి వనపర్తి జిల్లా ఎస్పీ అపూర్వరావును ఆదేశించారు.
ఈ ఘటనపై వనపర్తి జిల్లా ఎస్పీ అపూర్వరావు వివరణ ఇచ్చారు. ఈ ఘటనకు పాల్పడిన కానిస్టేబుల్ ను గుర్తించి చర్యలు తీసుకొంటున్నట్టుగా ఆమె చెప్పారు, భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు చోటు చేసుకోకుండా చూస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. ఈ మేరకు డీజీపీ మహేందర్ రెడ్డికి, మంత్రి కేటీఆర్ కు ఆమె ట్వీట్ చేశారు.