హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది.  మాజీ మంత్రి, టీ  కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డికి వ్యతిరేకంగా వనపర్తి డీసీసీ మాజీ అధ్యక్షుడు శంకర్ ప్రసాద్ ఆందోళన నిర్వహించారు. 

హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి, టీ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డికి వ్యతిరేకంగా వనపర్తి డీసీసీ మాజీ అధ్యక్షుడు శంకర్ ప్రసాద్ ఆందోళన నిర్వహించారు. తనపై బహిష్కరణ వేటు వేయడానికి వ్యతిరేకంగా తన మద్దతుదారులతో నిరసనకు దిగారు. కాంగ్రెస్ నుంచి తనను అన్యాయంగా బహిష్కరించారని శంకర్ ప్రసాద్ అన్నారు. తాను కోవర్టు అని నిరూపిస్తే గాంధీ భవన్ ముందే ఉరి వేసుకుంటానని చెప్పారు. నిరూపించకపోతే భేషరుతుగా చిన్నారెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

ఇదిలా ఉంటే.. వనపర్తి కాంగ్రెస్‌లో కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. అయితే ఇటీవల వనపర్తి జిల్లాకు చెందిన పులువరు నేతలు చిన్నారెడ్డికి వ్యతిరేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి శంకర్‌ప్రసాద్‌ కూడా హాజరయ్యారు. అయితే ఈ సమావేశంలో చిన్నారెడ్డిని దూషించారని, వివరణ ఇవ్వాలని శంకర్‌ప్రసాద్‌కు నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత ఆయన వివరణపై సంతృప్తి చెందని క్రమశిక్షణా కమిటీ.. ఏఐసీసీ ఆదేశాలను ఉల్లంఘించి, చిన్నారెడ్డిని దూషించారనే ఆరోపణలపై శంకర్‌ప్రసాద్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది. బహిష్కరణ వెంటనే అమల్లోకి వస్తుందని ఉత్తుర్వుల్లో పేర్కొంది.