ఇదోరకం పొలిటికల్ క్యాంపెయిన్... బిఆర్ఎస్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వెలిసిన వాల్ పోస్టర్లు
ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి వ్యతిరేకంగా బిజెపి కార్పోరేటర్ పేరిట వెలిసిన ప్లెక్సీలు కలకలం రేపుతున్నాయి.
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు కొత్తరకం ప్రచారం ప్రారంభించాయి. ఇంతకాలం రాజకీయ నాయకులు తనకు అనుకూల ప్రచారం కోసం బ్యానర్ల, ప్లెక్సీలు, వాల్ పోస్టర్లు తయారుచేయించుకునేవారు. కానీ ప్రస్తుతం ప్రత్యర్థిని దెబ్బతీయడానికి కూడా వీటిని వాడుతున్నారు. ఇలా ప్రధాని మోదీ, అమిత్ షా వంటి బిజెపి నాయకులు... సోనియా, రాహుల్ వంటి కాంగ్రెస్ నాయకుల తెలంగాణ పర్యటనల సందర్భంగా ఇలాంటి ప్రచారమే బిఆర్ఎస్ నాయకులు చేసారు. తాజాగా బిజెపి నాయకులు కూడా ఇదే పని చేసారు. అధికార బిఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయన సొంత నియోజకవర్గం ఎల్బీ నగర్ లో వాల్ పోస్టర్లు, కరపత్రాలు కలకలం రేపుతున్నారు.
ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రౌడీయిజం చేస్తున్నారని... ఆయనపై రౌడీషీట్ ఓపెన్ చేయాలని పోలీసులను కోరుతూ చంపాపేట బిజెపి కార్పోరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి పేరిట వాల్ పోస్టర్లు వెలిసారు. అంతేకాదు బిఆర్ఎస్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కరపత్రాలు ముద్రించి దినపత్రికల్లో పెట్టి పంపిణీ చేస్తున్నారు. ఇలా ఎల్బీ నగర్ లో సుధీర్ రెడ్డికి వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లను స్థానిక ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.
తనను వ్యతిరేకించే నాయకులపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దాడులు చేయిస్తున్నారని పోస్టర్లలో పేర్కొన్నారు. వారిలో వైసిపి ఎంపీ కృష్ణయ్య, మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి లతో పాటు సొంత పార్టీ నాయకులపై కూడా తన గూండాలతో దాడులు చేయించాడని ఆరోపించారు. ఇలా గత వందరోజుల్లో ఐదుగురిపై భౌతిక దాడులు చేయించారని వాల్ పోస్టర్లలో పేర్కొన్నారు.
Read More కేసీఆర్ వ్యూహం బెడిసికొట్టిందాా...! కాంగ్రెస్ లోకి వలసలు... రేవంత్ తో మరో కీలక నేత భేటీ
ఎల్బీ నగర్ లో రౌడీ రాజ్యం కొనసాగుతోందని...దీనిపై కేంద్ర ప్రభుత్వంతో పాటు గవర్నర్ కు పిటిషన్ ఇవ్వనున్నట్లు బిజెపి నేత మధుసూదన్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి వ్యతిరేకంగా తనతో కలిసి రావాలని అనుకుంటే 8978796777 నెంబర్ కు కాల్ చేసి తెలియజేయాలని బిజెపి కార్పోరేట్ మధుసూదన్ పేర్కొన్నారు.
అయితే ఈ పోస్టర్లపై బిఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యే అనుచరులు భగ్గుమంటున్నారు. వెంటనే ఈ పోస్టర్లు, కరపత్రాలు పంపిణీ చేయించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు.తమ నాయకులపై ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.