తాళి,మెట్టెలు తీసేసి పరీక్షకు భార్యలు.. భర్తల నిరసన
తమ భార్యల తాళి, మెట్టలు పట్టుకొని మరీ వారు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంతకీ మ్యాటరేంటంటే..
మెదక్ జిల్లా వీఆర్వో పరీక్షా కేంద్రం వద్ద అభ్యర్థుల భర్తలు, బంధువులు నిరసన కార్యక్రమం చేపట్టారు. తమ భార్యల తాళి, మెట్టలు పట్టుకొని మరీ వారు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంతకీ మ్యాటరేంటంటే..
సోమవారం వీఆర్వో పరీక్ష జరుగుతోంది. ఈ పరీక్షను మెదక్ లోని నర్సాపూర్ లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ లో నిర్వహించారు. పరీక్షకు హాజరైన మహిళలను తనిఖీ చేయడంలో భాగంగా.. వారి తాళి, మెట్టెలు తీసేసి పరీక్షా హాలులోకి అడుగుపెట్టాలని సిబ్బంది హుకుం జారీ చేశారు.
మహిళా అభ్యర్థులు ఎంత వేడుకున్నా.. వారు అంగీకరించలేదు. దీంతో చేసేది లేక.. తాళి, మెట్టెలు తీసేసి వారు పరీక్షకు హాజరయ్యారు. సిబ్బంది ఇలాంటి కండిషన్ పెట్టడాన్ని అంగీకరించని వారి భర్తలు, బంధువులు తాళి చేతపట్టుకొని నిరసన కార్యక్రమం చేపట్టారు. అధికారులు ఆభరణాలు వేసుకున్న వారిని అనుమతించవద్దంటూ చెప్పడంతో ఇలా చేయాల్సి వచ్చిందని సిబ్బంది తమ తప్పును కవర్ చేసుకోవడం గమనార్హం.