తెలంగాణలో గత కొద్దిరోజులుగా వీఆర్ఏలు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌తో వీఆర్ఏ సంఘం నాయకులు జరిపిన చర్చలు సఫలం అయ్యాయి.
తెలంగాణలో గత కొద్దిరోజులుగా వీఆర్ఏలు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. పే స్కేల్ అమలు, అర్హులైన వారికి ప్రమోషన్లు తదితర డిమాండ్లతో వీఆర్ఏలు నిరసన చేపట్టారు. తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌తో వీఆర్ఏ సంఘం నాయకులు జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. ఈ సమావేశంలో వీఆర్ఏల డిమాండ్లపై తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) ప్రతినిధులు, వీఆర్ఏ సంఘం నాయకులతో సీఎస్ చర్చించారు.
సీఎస్‌తో సమావేశం అనంతరం మాట్లాడిన వీఆర్ఏల జేఏసీ ప్రతినిధులు.. 80 రోజులుగా వీఆర్ఏలు సమ్మె చేస్తున్నారని చెప్పారు. వీఆర్ఏల సమస్యలు పరిష్కరిస్తామని సీఎస్ హామీ ఇచ్చారని తెలిపారు. రేపటి నుంచి విధులకు హాజరు కానున్నట్టుగా వెల్లడించారు.
వీఆర్ఏల డిమాండ్లపై సీఎస్‌తో చర్చించినట్టుగా ట్రెసా అధ్యక్షుడు రవీందర్ రెడ్డి తెలిపారు. సమస్యలను పరిష్కరిస్తామని సీఎస్ హామీ ఇచ్చారని చెప్పారు. నవంబర్ 7 తర్వాత నిర్ణయం తీసుకుంటామని సీఎస్ చెప్పినట్టుగా తెలిపారు. మునుగోడు ఉపఎన్నిక దృష్ట్యా వచ్చే నెల నిర్ణయిస్తామని చెప్పారని పేర్కొన్నారు. వీఆర్‌ఏలు రేపటి నుంచి విధులకు హాజరవుతారని తెలిపారు.
