ఓటరు నమోదు, పరిశీలన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని రాష్ట్ర ఎన్నికల కమీషన్ జాయింట్ సీఈవో రవికిరణ్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్ అరణ్య భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రవికిరణ్ మాట్లాడుతూ.. ఒకసారి ఓటు నమోదు చేసుకున్నప్పటికీ, ప్రతి ఏటా స్పెషల్ డ్రైవ్‌లో ఓటర్లు తమ వివరాలను తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని ఆయన సూచించారు.

ఓటర్ హెల్ప్‌లైన్ లేదంటే, www.nvsp.in వెబ్‌సైట్, మీ సేవా కేంద్రం, ఫెసిలిటీ సెంటర్‌లలో ఎక్కడైనా కొత్త ఓటు నమోదు, ఇప్పటికే ఓటర్ అయితే అన్ని వివరాలు సరిచూసుకోవాలని రవికిరణ్ తెలిపారు. ఈ స్పెషల్ డ్రైవ్ అక్టోబర్ 15 వరకు ఉంటుందన్నారు.

తమ పోలింగ్ కేంద్రం తెలుసుకోవటంతో పాటు, అక్కడ పౌరులకు ఉన్న ఏర్పాట్లపై ఎన్నికల సంఘానికి తగిన సలహాలు,  సూచనలు కూడా ఆన్ లైన్ లో చేయవచ్చని, ఓటర్ వెరిఫికేషన్ చేసుకున్న వాళ్లకు ఎన్నికల కమిషన్ ద్వారా ధ్రువీకరణ పత్రం కూడా ఆన్ లైన్ లోనే వస్తుందని తెలిపారు.