Asianet News TeluguAsianet News Telugu

బీఆర్‌ఎస్‌కు ఓటేస్తే బీజేపీకి వేసినట్టే.. ఈ రెండు పార్టీల వెంటే ఎంఐఎం.. : కాంగ్రెస్

Telangana Assembly Elections 2023: పార్లమెంటులో అవసరమైనప్పుడల్లా బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇచ్చిందని కాంగ్రెస్ లీడ‌ర్ రాహుల్ గాంధీ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీబీఐ, ఈడీ, ఐటీ విచారణ జరగకపోవడమే బీఆర్ఎస్, బీజేపీల బంధానికి నిదర్శనమంటూ ఆరోపించారు.
 

Vote for BRS will be vote for BJP, says Congress leader Rahul Gandhi Mulugu RMA
Author
First Published Oct 18, 2023, 9:22 PM IST

Congress leader Rahul Gandhi:  రానున్న ఎన్నిక‌ల్లో అధికార పార్టీ బీఆర్ఎస్ కు త‌గిన గుణ‌పాఠం చెప్పాల‌నీ, వారిని ఓడించాలని కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్ గాంధీ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయ‌న బుధ‌వారం తెలంగాణ ఎన్నిక‌ల కాంగ్రెస్ ప్ర‌చారాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తుంద‌ని ధీమా వ్య‌క్తంచేశారు. ఈ క్ర‌మంలోనే బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంల‌ను టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆ మూడు పార్టీలు  కలిసి ఉన్నాయన్న ఆరోపణను పునరుద్ఘాటిస్తూ, దేశవ్యాప్తంగా బీజేపీతో కాంగ్రెస్ సైద్ధాంతిక యుద్ధం చేస్తోందన్నారు. బీజేపీతో కాంగ్రెస్ ఎప్పటికీ రాజీపడదనీ, వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

పార్టీ విజయభేరి యాత్రను ప్రారంభించిన అనంతరం ములుగులో తన సోదరి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో కలిసి నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణలో పోరు బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్యే ఉందనీ, రాష్ట్రంలో బీజేపీ ఇప్పటికే ఓటమిని చవిచూస్తోందని, ఆ విషయం తనకు తెలుసున‌ని పేర్కొన్నారు. ఇదే స‌మ‌యంలో తెలంగాణలో బీఆర్ఎస్ గెలవాలని బీజేపీ కోరుకుంటోందనీ, ఆ పార్టీలు క‌లిపి ప‌నిచేస్తున్నాయ‌నీ, వారి వెంట ఎంఐఎం కూడా ఉంద‌ని ఆరోపించారు. పార్లమెంటులో అవసరమైనప్పుడల్లా బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇచ్చిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు సీబీఐ, ఈడీ, ఐటీ విచారణ జరగకపోవడమే బీఆర్ఎస్, బీజేపీల బంధానికి నిదర్శనమన్నారు.

"ప్రతిపక్ష నేతలందరిపైనా కేసులు ఉన్నాయి. నాపై 24 కేసులు ఉన్నాయి. నన్ను ఇంటి నుంచి గెంటివేసి, నా పార్లమెంటు సభ్యత్వాన్ని లాక్కున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పై బీజేపీ విరుచుకుపడుతోంది. మా నేతలపై కేసులు పెడుతున్నారు. కాంగ్రెస్ సిద్ధాంత ఆధారిత పార్టీ అని వారికి తెలుసు. బీజేపీతో తాము ఎప్పటికీ రాజీపడలేమని" ఆయన అన్నారు. గత నెలలో పార్టీ ప్రకటించిన ఆరు హామీలను రాహుల్ గాంధీ మ‌రోసారి గుర్తుచేస్తూ.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పోడు భూములు, అసైన్డ్ భూములపై హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ములుగులోని సమ్మక్క సారక్క గిరిజన పండుగకు జాతీయ పండుగ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ పార్టీ 2004లో తెలంగాణ రాష్ట్రాన్ని హామీ ఇచ్చిందనీ, అలాంటి నిర్ణయం వల్ల పార్టీకి రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసినా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని రాహుల్ గాంధీ అన్నారు. ఎన్నిక‌ల ముందు అనేక హామీల‌తో ముందుకువ‌చ్చిన‌ కేసీఆర్ హామీలను నెరవేర్చలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ధరణి పోర్టల్ కుంభకోణం ద్వారా ప్రజల భూములు లాక్కున్నారని ఆరోపించారు.

Follow Us:
Download App:
  • android
  • ios