బిజెపి నేత, మాజీ ఎంపీ వివేక్ రాజకీయంగా తనదైన శైలిలో అడుగులు వేస్తున్నారు.  ఇప్పటికే అమిత్ షా తో భేటీ తర్వాత ఉత్తర తెలంగాణ బాధ్యతలు మీరే చూసుకోవాలని ఆయనిచ్చిన ఆదేశాలతో ఉత్తర తెలంగాణ జిల్లాలపై దృష్టి సారించిన వివేక్ ఆ  ప్రాంతంలో పార్టీ ని పటిష్టానికి పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పర్యటిస్తూ వివిధ పార్టీలలో ఉన్న కీలక నేతలకు తనదైన శైలిలో వల విసురుతూ బిజెపి పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో కూడా దగ్గరుండి స్థానిక అభ్యర్థులను ఎంపిక చేసి వారిని గెలిపించే బాధ్యతను భుజానెత్తుకున్నారు. అంతేకాకుండా వారికి ఆర్థికంగా కూడా అండగా ఉండి వీలైనంత మేరకు పార్టీ పటిష్టానికి పావులు కదుపుతున్నారు.తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గత కొంత కాలంగా  క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. దాని కోసమే పార్టీ కార్యకర్తలలో ఉత్సాహం నింపటానికి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సమావేశాలు పెడుతూ వీలైనన్ని మున్సిపల్ స్థానాలు గెలిచేలా కార్యకర్తలను ఎన్నికలకు సమాయత్తం చేశారు.

కొన్ని జిల్లాలో స్థానికంగా బలంగా ఉన్న నేతలను పార్టీలోకి తీసుకొచ్చి స్థానిక నేతలతో సమన్వయం చేసుకొనేలా కృషి చేయటంలో చాలావరకు సఫలమయ్యారు.స్థానికంగాఉండే కొందరి నేతల్లో విబేధాలను పక్కన పెట్టి పార్టీ కోసం కష్టపడేలా అందరిని ఏకతాటిపై తేవటంలో తనదైన వ్యూహాన్ని అమలు చేశారు. కొన్ని జిల్లాల్లోని మున్సిపాలిటీలలో బిజెపికి గెలిచే అవకాశాలున్న స్థానాల్లో అక్కడ స్థానిక నాయకులకు వివేక్ కొన్ని సూచనలు ఇస్తూ, మెజారిటీ స్థానాలు కైవసం చేసుకునే విధంగా వివేక్ వ్యూహరచనలు చేశారు. దీంతో స్థానిక నాయకులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాకుండా మున్సిపాలిటీలు ఏవైతే బిజెపికి గెలిచే అవకాశముందో అక్కడ టిఆర్ఎస్ అధికారంలో ఉండటంతో గెలిచిన అభ్యర్థులు లొంగకుండా చైర్మన్ గిరి మరియు మేయర్ గిరి అవకాశం కోల్పోకుండా ఇప్పటి నుండే స్థానిక జిల్లా నాయకులకు తగిన సలహాలు ఇస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా వివేక్ పక్క ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు. దీంతో ఉత్తర తెలంగాణలో వీలైనన్ని మున్సిపాలిటీలను గెలిపించే దిశగా వివేక్ దూసుకెళ్తున్నారు