వరంగల్: మాజీ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారిని కావాలనే కుట్రతో ఓడించారని విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వినుకొండ శంకరాచారి ఆరోపించారు. విశ్వబ్రాహ్మణుడైనందుకే అగ్ర వర్ణాలంతా కలిసి మధుసూదనా చారిని  ఓడించారని వ్యాఖ్యానించారు.  

మాజీ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి భూపాలపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని, ఏ నాయకుడు వచ్చినా అంత అభివృద్ధి చేయలేడని తెలిపారు. మధుసూదనాచారిపై పోటీ చేసిన వారు కర్ర దందా, కల్తీ పెట్రోల్‌ దందా, ఇసుక దందా చేసిన వారని, మరొకరు బియ్యం మాఫియా దందా చేసిన వారని దుయ్యబట్టారు. ఓటర్లకు విచ్చలవిడిగా మద్యం, డబ్బులు, చీరలు పంచి గెలుపొందాడని విమర్శించారు.
 
ఉన్నత వర్గాల వారందరూ ఏకమై బీసీ సామాజిక వర్గానికి చెందిన సిరికొండను గెలువకుండా చేశారన్నారు. స్పీకర్‌ హోదాలో భూపాలపల్లి నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసిన ఘనత సిరికొండకే దక్కుతుందని భూపాలపల్లిలో ఎవరు గెలిచినా అలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. 

చెంచులకు ఎనలేని సేవ చేసిన ఘనత సిరికొండకే దక్కుతుందని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ వెన్నంటి ఉండి తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర వహించిన మధుసూదనాచారికి ఎమ్మెల్సీ టికెట్‌ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని కోరారు.