హైదరాబాద్: తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంపై ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు. ప్రమాదంలో మృతిచెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు, మరియు గాయపడిన వారికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్షతగాత్రులను ఆదుకుంటోందని ఆశిస్తున్నట్లు రామ్ నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు.

ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం విని షాక్  కు గురయ్యానని నోటి వెంట మాటలు రావడం లేదని భారత ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని వారికి తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. మృతుల కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని కోరుకున్నట్లు తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్ చేశారు.

ఢిల్లీ: కొండగట్టు ప్రమాద ఘటనపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రమాద బాధితులకు అవసరమైన సహాయం చెయ్యాలని ఆదేశించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతున్నట్లు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 

హైదరాబాద్‌: జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద జరిగిన ఘోర ప్రమాదం తన గుండెలు పిండేసిందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపుగా 88 మందితో వెళ్తున్నఆర్టీసీ బస్సు కొండగట్టు ఘాట్‌ రోడ్డులోని చివరి మూలమలుపు వద్ద అదుపుతప్పి లోయలో పడి 52 మంది మృతిచెందడం కలచివేసిందన్నారు. ఈ ఘోర ప్రమాదం తనను ఎంతో బాధించిందని పవన్ ‌ప్రకటనలో పేర్కొన్నారు. 

మాటలకు అందని విషాదం. గుండెలు పిండేసే హృదయ విదారక సంఘటన. కొండగట్టు ఘాట్‌ రోడ్‌ బస్సు ప్రమాదంలో 50 మంది వరకు మృతి చెందారని, మరో పది మంది గాయపడ్డారని తెలిసిన వెంటనే మనసంతా భారంగా దుఃఖంతో నిండిపోయిందన్నారు. మృతి చెందిన వారిలో 25 మంది మహిళలు, ఏడుగురు చిన్నారులు ఉండటం మరింత బాధాకరమని కొద్ది క్షణాల్లో మృత్యువు పొంచి ఉందని తెలియని ఆ అమాయక ప్రయాణికులను తలచుకుంటే మనసు ద్రవించిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఆర్టీసీ బస్సులు ప్రయాణించని ఈ ఇరుకైన ఘాట్‌ మార్గంలోకి ప్రమాదానికి గురైన బస్సు, అమాయకుల ప్రాణాలను బలితీసుకోవడానికే వచ్చినట్లు అనిపిస్తోందన్నారు. నిండు ప్రయాణికులతో వెళ్తున్న ఈ బస్సు లోయలోకి పడిపోవడం దురదృష్టకరమన్న పవన్ చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. మృతుల కుటుంబాలకు తన సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలను క్షతగాత్రులను తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని ప్రకటనలో కోరారు.