టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పంచాయితీ ఎన్నికల ప్రచారంలో చేధు అనుభవం ఎదురయ్యింది. ఖమ్మం జిల్లాలోని తన నియోజకవర్గ పరిధిలో టిడిపి పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించుకోడానికి సండ్ర గ్రామాల్లో తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నిన్న ఓ గ్రామానికి వెళ్లిన ఆయన్ని అడ్డుకున్న గ్రామస్థులు తమ గ్రామ సమస్యలపై ప్రశ్నించారు. దీంతో గ్రామంలో గందరగోళం నెలకొనగా సండ్ర ప్రచారం చేపట్టకుండానే వెనుదిరిగారు. 

ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గం అన్నారుగూడెంలో దొడ్డా నిర్మల అనే మహిళ సర్పంచ్ గా పోటీచేస్తున్నారు. ఈమె అభ్యర్థిత్వాన్ని టిడిపి బలపర్చింది. దీంతో ఆమె మద్దతుగా ప్రచారం నిర్వహించాలని భావించిన స్థానిక ఎమ్మెల్యే సండ్ర మంగళవారం రాత్రి గ్రామానికి వెళ్లారు. 

అయితే సండ్ర నిర్వహిస్తున్న ప్రచారాన్ని గ్రామస్థులు అడ్డుకున్నారు. కేవలం ఆయన ఇలా ఎన్నికల సమయంలో మాత్రమే తమ గ్రామానికి వస్తున్నారని...ఆ తర్వాత గ్రామ సమస్యలను పట్టించుకోవడం లేదంటూ గ్రామస్థులు ఆరోపించారు. ఎటువంటి అభివృద్ధి చేయకుండా ఓట్లడిగేందుకు ఎందుకొచ్చారంటూ సండ్రను గ్రామస్థులు నిలదీశారు.

దీంతో సండ్రతో పాటు అనుచరులు, సర్పంచ్ అభ్యర్థి గ్రామస్థులను సముదాయించడానికి ప్రయత్నించారు. అయితే ఎమ్మెల్యే తమ గ్రామంలో ప్రచారం నిర్వహించడానికి వీల్లేదని గ్రామస్థులు తేల్చిచెప్పడంలో సండ్ర వెనుదిరిగారు.