Vikarabad SI : పెళ్లైన వారం రోజులకే వికారాబాద్ వన్‌టౌన్ ఎస్‌ఐ మృతి
Vikarabad SI : నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ కొన్న ఘటనలో వికారాబాద్ వన్‌టౌన్ ఎస్‌ఐ సహా ఆయన తండ్రి మృత్యువాత పడ్డారు. పెళ్లైన వారం రోజులకే వికారాబాద్ వన్‌టౌన్ ఎస్‌ఐ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డటంతో తీవ్ర విషాదం నెలకొంది.
Vikarabad SI : కొత్త సంవత్సరం తొలి రోజే.. వివాదం చోటు చేసుకుంది. నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు, ఆటో ఢికొన్న ఘటనలో వికారాబాద్ వన్‌టౌన్ ఎస్‌ఐ సహా ఆయన తండ్రి మృత్యువాత పడ్డారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం చింతపల్లి మండలం పోలేపల్లి రాంనగర్ వద్ద జరిగింది. చింతపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం మాన్యానాయక్ తండాకు చెందిన శ్రీను నాయక్ (30) వికారాబాద్ వన్ టౌన్ ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా.. ఎస్ఐ శ్రీను నాయక్ కు గత నెల (డిసెంబర్ 26న) వివాహం జరిగింది. ఈ క్రమంలో తన ఇంట్లో కార్యక్రమం ఉండడంతో తన తండ్రి మాన్యానాయక్ (55)ను తీసుకొని హైదరాబాద్ నుంచి స్వగ్రామం మాన్యానాయక్ తండాకు వెళ్లారు. అక్కడ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని.. తరువాత తన తండ్రితో కలిసి హైదరాబాద్‌కు ఆటోలో బయలుదేరారు.
Read Also: మందుబాబులకి మరొకరు బలి... పీకలదాకా తాగి సైకిలిస్ట్‌ను కారుతో ఢీ, నిందితుడు ఎయిర్‌లైన్స్ ఉద్యోగి
ఈ క్రమంలో చింతపల్లి మండలం పోలెపల్లి రాంనగర్ గ్రామ పరిధిలోకి రాగానే హైదరాబాద్ నుంచి దేవరకొండ కు వెళ్తున్న బస్సు వారి ఆటోను ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాద స్థలంలోనే శ్రీను నాయక్, అతని తండ్రి మృతి చెందారు. విషయం తెలుసుకున్న చింతపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఎస్ఐ శ్రీను నాయక్ ఆటో నడిపినట్లు పేర్కొంటున్నారు. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ డ్రైవర్ అదుపులో ఉన్నారు.
Read Also: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఒక్కరోజులో 6 వేల NGOsల విదేశీ విరాళాలు కట్!
శ్రీను నాయక్ 2019 లో ఎస్సైగా సెలక్ట్ అయ్యారు. అప్పటి నుంచి ట్రైనీ ఎస్సైగా చేస్తూ... గత 15 రోజుల క్రితమే ఆయన వికారాబాద్ వన్ టన్ ఎస్సైగా బాధ్యతలు చేపట్టాడు. శ్రీను నాయక్‌కు గత వారం రోజుల క్రితమే (డిసెంబర్ 26న) చింతపల్లి మండలం కొక్కిరాలతండాకు చెందిన కొర్ర వర్ష అనే యువతితో వివాహమైంది. శుక్రవారం.. తన కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా గడిపిన ఆయన.. విధుల్లో చేరేందుకు వికారాబాద్ కు తన సమీప బంధువు కారులో బయలుదేరాడు. అయితే.. వింజమూరి స్టేజి వద్ద తన తండ్రి ఆటో ఆగి ఉండటం చూసి.. కారు నుంచి దిగి.. ఏమైందని అడగ్గా తన చెయ్యి నొప్పుగా ఉందని.. ఆటో నడపలేకపోతున్నానని తండ్రి చెప్పడంతో బంధువులను కారులో పంపించి.. తన తండ్రితో కలిసి ఆటోలో బయలుదేరాడు. పోలేపల్లి రామ్‌నగర్ స్టేజి వద్దకు వచ్చేసరికి ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు వీరి ఆటోను ఢీకొట్టింది. ప్రమాదంలో తండ్రీ కుమారులిద్దరు మృతి చెందారు.