నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలో దారుణం వెలుగుచూసింది. ఓ ఆరేళ్ల బాలికను ఆమె కన్నతల్లే హత్య చేసింది. అనంతరం మాక్లూరు మండలంలోని చిన్నాపూర్ శివారులోని అటవీ ప్రాంతంలో పడేసింది. ప్రియుడితో కలిసి ఆమె ఈ దారుణానికి ఓడిగట్టింది.
నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలో దారుణం వెలుగుచూసింది. ఓ ఆరేళ్ల బాలికను ఆమె కన్నతల్లే హత్య చేసింది. అనంతరం మాక్లూరు మండలంలోని చిన్నాపూర్ శివారులోని అటవీ ప్రాంతంలో పడేసింది. ప్రియుడితో కలిసి ఆమె ఈ దారుణానికి ఓడిగట్టింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. విజయవాడలోని భవానిపురానికి చెందిన గురునాథం, దుర్గా భవాని భార్యభర్తలు. వీరికి ఇద్దరు కూతుళ్లు నాగలక్ష్మి (6), గీతా మాధవి (14 నెలలు) ఉన్నారు. ఈ దంపతులు ఐదేళ్ల క్రితం బతుకుదెరువు కోసం నిజమాబాద్‌కు వచ్చారు. గురునాథం మేస్త్రీ పనులు చేసేవాడు. ఆ తర్వాత కొంతకాలానికి తిరిగి భవానీపురం వెళ్లిపోయారు.
నిజామాబాద్‌లో ఉన్న సమయంలో రైల్వే స్టేషన్ ప్రాంతంలో చిన్న చిన్న పనులు చేసుకునే బాన్సువాడ మండలం కొల్లూరుకు చెందిన దుండుగుల శ్రీనుతో దుర్గా భవానికి పరిచయం ఏర్పడింది. ఇది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇక, విజయవాడ వెళ్లిన తర్వాత గురునాథం, దుర్గా భవానిల మధ్య తరుచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే గత నెల 13న బంధువుల ఇంటికి వెళ్లివస్తానని చెప్పిన దుర్గ భవానికి ఇంట్లో నుంచి వెల్లిపోయింది. దుర్గ భవాని బంధువుల ఇంటికి వెళ్లకపోవడం, ఇంటికి కూడా తిరిగి రాకపోవడంతో.. ఆమె భర్త గురునాథం విజయవాడ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే దుర్గ భవాని నిజామాబాద్‌లో ఉందనే విషయం తెలిసింది.
దీంతో గురునాథం.. నిజామాబాద్‌కు వచ్చి భార్య కోసం వెతకడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే రైల్వే స్టేషన్ ప్రాంతంలో శ్రీనుతో దుర్గ భవానీ ఉంటుందనే తెలుసుకున్నాడు. ఆమె వెంట చిన్న కూతురు గీతమాధవి ఉండగా.. పెద్ద కూతురు నాగలక్ష్మి కనిపించలేదు. దీంతో గురునాథం.. నాగలక్ష్మీ ఎక్కడని ప్రశ్నించాడు. దీంతో నాగలక్ష్మిని హత్య చేసి అడవిలో పారేశామని దుర్గ భవాని తెలిపింది. దీంతో గురునాథం పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు దుర్గభవాని, శ్రీనులను అదుపులోకి తీసుకుని విచారించారు.
ఈ క్రమంలోనే నాగలక్ష్మిని నిజామాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో గొంతు నులిమి చంపి.. మాక్లూర్ మండలం చిన్నాపూర్ అడవి ప్రాంతంలో పడేసినట్లుగా విచారణలో వారిద్దరు అంగీకరించారు. దీంతో పోలీసులు వారిని తీసుకుని అటవీ ప్రాంతంలో చూడగా.. అక్కడ నాగలక్ష్మీ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. దీంతో అక్కడే పోస్టుమార్టమ్ నిర్వహించి.. అంత్యక్రియలు పూర్తి చేశారు. భర్త గురునాథం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
