Asianet News TeluguAsianet News Telugu

వచ్చేవారం ఢిల్లీకి విజయశాంతి: సొంత గూటికి తెలంగాణ రాములమ్మ

కాంగ్రెసు ప్రచార కమిటీ చైర్ పర్సన్, సినీ నటి విజయశాంతి వచ్చే వారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో పార్టీ పెద్దలను కలిసి ఆమె బిజెపిలో చేరుతారని భావిస్తున్నారు. ఇప్పటికే ఆమె కాంగ్రెసుకు దూరమయ్యారు.

Vijayashanti to join in BJP next week in Delhi
Author
Hyderabad, First Published Nov 10, 2020, 6:00 PM IST

హైదరాబాద్:  కాంగ్రెసు ప్రచార కమిటీ చైర్ పర్సన్, సినీ నటి విజయశాంతి బిజెపిలో చేరడం ఖాయమైంది. ఆమె వచ్చే వారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఆ సమయంలో ఆమె బిజెపిలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. తద్వారా ఆమె సొంత గూటికి చేరుకుంటారు. బిజెపి ద్వారానే ఆమె తన రాజకీయ ఆరంగేట్రం చేశారు. 

ఢిల్లీలో విజయశాంతి పార్టీ పెద్దలతో సమావేశం కానున్నారు. పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆమె బిజెపిలో చేరే అవకాశం ఉంది. కాంగ్రెసుకు రాష్ట్రంలో భవిష్యత్తు లేదనే భావనకు వచ్చిన తర్వాత ఆమె బిజెపిలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

చాలా కాలంగా ఆమె కాంగ్రెసు పార్టీకి దూరంగానే ఉంటున్నారు. ప్రచార కమీటీకి సారథ్యం వహిస్తున్నప్పటికీ ఆమె దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లలేదు. పైగా, ఆత్మప్రబోధానుసారం ఓటు వేయాలని ఆమె దుబ్బాక ఓటర్లకు పిలుపునిచ్చారు. దాంతోనే ఆమె కాంగ్రెసు నుంచి తప్పుకుంటారనే భావన బలపడింది.

ఇదిలావుంటే, దుబ్బాక శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెసు ప్రచార కమిటీ చైర్ పర్సన్, సినీ నటి విజయశాంతి చెప్పిన మాట నిజమని తేలింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి ఇటీవల ఆమె ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు ఎవరు తీసిన గోతిలో వారే పడుతారని ఆమె అన్నారు. 

కాంగ్రెసును బలహీనపరచడానికి కేసీఆర్ ఆ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి, భయపెట్టి టీఆర్ఎస్ లో చేర్చుకున్నారని, దీంతో మరో జాతీయ పార్టీ అయిన బిజెపి తెలంగాణలో బలపడిందని, కేసీఆర్ కు సవాల్ విసిరే స్థాయికి ఎదిగిందని ఆమె అన్నారు. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాన్ని బట్టి చూస్తే విజయశాంతి అంచనా నిజమని తేలింది. 

కాంగ్రెసు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందంటూ ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయం వ్యక్తం చేశారు. అదే నిజమైంది. దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెసు మూడో స్థానానికి పరిమితమైంది. టీఆర్ఎస్ కు రాజీనామా చేసి తమ పార్టీలో చేరిన చేరుకు శ్రీనివాస రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇచ్చింది. అయితే, ఈ ఎన్నికల్లో ఆయన ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. 

బిజెపి అభ్యర్థి రఘునందన్ రావుకు, టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు మధ్య మాత్రమే పోరు జరిగింది. ఈ హోరాహోరీ పోరులు చెరుకు శ్రీనివాస్ రెడ్డి మూడో స్థానంలో నిలిచారు. 

ఈ స్థితిలో విజయశాంతి కాంగ్రెసు భవిష్యత్తుపై కూడా సరైన అంచనాకే వచ్చినట్లు కనిపిస్తున్నారు. విజయశాంతి త్వరలో బిజెపిలో చేరుతారనే ప్రచారం కూడా ఉంది. అయితే, ఇప్పటి వరకు దానిపై స్పష్టత లేదు. హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి, బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఆమెతో భేటీ అయ్యారు. 

Follow Us:
Download App:
  • android
  • ios