హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని, ప్రచార రథసారథిగానే వ్యవహరిస్తానని సినీ నటి, కాంగ్రెసు నేత విజయశాంతి చెప్పారు. అయితే, కాంగ్రెసు అధిష్టానం మరో విధంగా ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. రాములమ్మను వచ్చే ఎన్నికల్లో పోటీకి దించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

విజయశాంతి దుబ్బాక నుంచి పోటీ చేస్తారని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఆమెను కూకట్ పల్లి నుంచి పోటీకి దించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సీటును వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ఆశించింది. టీడీపి నేత పెద్దిరెడ్డి ఈ సీటు నుంచి పోటీ చేయడానికి ఆసక్తి ప్రదర్శించారు. 

అయితే, ఆయనను పోటీకి దూరంగా ఉంచాలని పార్టీ నాయకత్వం భావించినట్లు తెలుస్తోంది. ఆయనకు ఎమ్మెల్సీ సీటు ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దాంతో ఆయన పోటీ చేయాలనే ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది.

ఆంధ్ర ఓటర్లు ఎక్కువగా ఉన్న కూకట్ పల్లిలో టీడీపికి విజయం నల్లేరు మీద నడక అనే అభిప్రాయం ఉంది. అయితే, విజయశాంతిని కూకట్ పల్లి నుంచి పోటీకి దించితే త్యాగం చేయడానికి టీడీపి నాయకత్వం సిద్ధపడినట్లు తెలుస్తోంది. 

అంతేకాకుండా, విజయశాంతి విజయం కోసం కూకట్ పల్లిలో ప్రచారం చేయడానికి సినీ హీరో, ఆంధ్రప్రదేశ్ టీడీపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా ప్రచారం చేస్తారని అంటున్నారు. బాలకృష్ణ, విజయశాంతి కలిసి పలు సినిమాల్లో నటించారు. బాలకృష్ణ ప్రచారానికి వస్తే విజయశాంతి విజయం మరింత సులభమవుతుందని అంటున్నారు.