Asianet News TeluguAsianet News Telugu

టీడీపితో పొత్తుపై అసంతృప్తి: సాయంత్రం ఢిల్లీకి రాములమ్మ

ముందస్తు ఎన్నికల సమరానికి కాంగ్రెస్ పార్టీ సై అంటోంది. ఇప్పటికే మేనిఫెస్టో విడుదల చేసి అధికార పార్టీ కంటే ఒక అడుగు ముందున్న కాంగ్రెస్ పార్టీ పార్టీ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తోంది. ఇప్పటికే 40 మంది కాంగ్రెస్ నేతలు జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. 

Vijayashanthi to meet Rahul gandhi
Author
Hyderabad, First Published Sep 14, 2018, 3:15 PM IST

హైదరాబాద్: ముందస్తు ఎన్నికల సమరానికి కాంగ్రెస్ పార్టీ సై అంటోంది. ఇప్పటికే మేనిఫెస్టో విడుదల చేసి అధికార పార్టీ కంటే ఒక అడుగు ముందున్న కాంగ్రెస్ పార్టీ పార్టీ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తోంది. ఇప్పటికే 40 మంది కాంగ్రెస్ నేతలు జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. 

ఈ నేపథ్యంలో ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న మాజీ ఎంపీ విజయశాంతి ఒక్కసారిగా తెరపైకి వచ్చారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ కోరినట్లు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికలపై రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. పార్టీకి ఇంతకాలం దూరంగా ఉన్నందుకు గల కారణాలు వివరించే అవకాశం ఉంది. 

మరోవైపు తెలుగుదేశం పార్టీతో పొత్తుపై రాములమ్మ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో టీడీపీతో పొత్తు ప్రస్తావనకు వచ్చినప్పుడు అనుచరుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. పొత్తును వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీకి లేఖ రాయాలని భావించారు కానీ అది విరమించుకున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే భారీగా నష్టపోతామని ఆమె భావిస్తున్నట్లు చెబుతున్నారు. 

రాష్ట్ర విభజన తర్వాత చాలా సమస్యలు పరిష్కారం కాకపోవడానికి చంద్రబాబు కారణమని ఆమె ఆరోపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుంటే నష్టపోతామని విజయశాంతి మెదక్ జిల్లా కాంగ్రెస్ నేతల వద్ద ఆవేదన వ్యక్తం చేశారని అంటున్నారు.
 
ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కొందరు నేతలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో తీవ్రంగా నష్టపోతామని ఆమె అన్నట్లు చెబుతున్నారు. హైదరాబాద్‌లో కొన్ని సీట్లు గెలుస్తామనే ఉద్దేశంతో కొందరు కాంగ్రెస్ నేతలు టీడీపీతో పొత్తు కోసం తహతహలాడుతున్నారని ఆమె విమర్శించినట్లు సమాచారం. 

ఇకపోతే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున మెదక్  పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు విజయశాంతి.  అప్పటి నుంచి నాలుగున్నరేళ్లుగా పొలిటికల్ స్క్రీన్ పై కనీసం దర్శనం కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండు రోజులుపాటు పర్యటించినా బయటకు రాలేదు. అంతేకాదు ఎన్నికల అనంతరం ఇప్పటి వరకు గాంధీభవన్ మెట్లెక్కలేదు రాములమ్మ.  

అయితే చాలా రోజుల తర్వాత బోనాల పండుగలో రాములమ్మ ప్రత్యక్షమయ్యారు. హైదరాబాద్‌లోని మహంకాళీ అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. దీంతో రాజకీయాల్లో ఇక రాములమ్మ జోరు పెంచనున్నారని  అంతా ఊహించారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. బోనం సమర్పించి వెళ్లిపోయిన రాములమ్మ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 
 
గత 20 రోజులుగా తెలంగాణలో ముందస్తు ఎన్నికలంటూ నానా హడావిడి జరుగుతున్నా కనీసం స్పందించలేదు విజయశాంతి. ముందస్తు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇలాంటి సమయంలో విజయశాంతి కాంగ్రెస్ పార్టీకి చేదోడు వాదోడుగా ఉంటారని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. ఒకవైపు సినీగ్లామర్..మరోవైపు వాగ్ధాటి అయిన విజయశాంతి ఎన్నికల స్క్రీన్ పై మెరిస్తే కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత మేలు జరుగుతుందని ఆ పార్టీ భావిస్తోంది.  

అయితే రాహుల్ గాంధీని కలిసేందుకు విజయశాంతి ప్రయత్నిస్తున్నారని ఇప్పటికే అపాయింట్మెంట్ కోరినట్లు ప్రచారం జరుగుతుండటంతో కాంగ్రెస్ పార్టీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 
   
 

Follow Us:
Download App:
  • android
  • ios