చార్మినార్ ఆయుర్వేద ఆస్పత్రిని తరలించవద్దంటూ వైద్య విద్యార్థులు చేస్తున్న ఆందోళనలో... ఓ పోలీసు అధికారి అసభ్యంగా ప్రవర్తించారు. ఆందోళనలో ఉన్న ఓ విద్యార్థినిని కాలితో తన్ని.. చేతితో గిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ కూడా అయ్యాయి.  కాగా ఈ ఘటనపై కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి స్పందించారు. 

ఈ ఘటనపై ఆమె తెలంగాణ ప్రభుత్వానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా ఈ అంశంపై ఆమె పోస్టు పెట్టారు. ఆయుర్వేద వైద్య విద్యార్థుల ఆందోళన సందర్భంగా మహిళా విద్యార్థుల పట్ల హైదరాబాద్ పోలీసులు అనుచితంగా అసభ్యంగా వ్యవహరించిన తీరు సభ్య సమాజం తలవంచుకునే విధంగా ఉందన్నారు.

ఈ ఘటనను చూసిన తర్వాత మహిళల విషయంలోనూ, విద్యార్థుల విషయంలోనూ టీఆర్ఎస్ అధినాయకత్వానికి టీఆర్ఎస్ పాలకులకు ఎంత చులకన భావం ఉందో మరోసారి అర్థమౌతుందని విజయశాంతి అన్నారు. ఓ అనామిక సంస్థకు టెండర్లు అప్పగించి ఇంటర్ విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న విషయాన్ని ఇంకా ఎవరూ మర్చిపోలేదని ఆమె అన్నారు.

విధి నిర్వహణలో ఉన్న మహిళా ఉద్యోగిపై టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సోదరుడు ఆటవికంగా దాడి చేసినా... కేసీఆర్ ప్రభుత్వం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదన్నారు. తాజాగా ఆయుర్వేద కళాశాల వైద్య విద్యార్థినుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు పట్ల  యావత్ రాష్ట్రం అట్టుడికిపోతున్నా టీఆర్ఎస్ పాలకులు చీమకుట్టినట్లుగా కూడా అనిపించడం లేదా అని ప్రశ్నించారు.

మహిళల భద్రత కోసం షీటీమ్స్ ఏర్పాటు చేశామని చెప్పుకుంటున్న కేసీఆర్.. మహిళా విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోలీసు అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలు చేసే విమర్శలను వారి వాదనను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పిన విధంగా ఈ విషయంలో మేమే చేసే డిమాండ్ పట్టించుకోకపోతే.. మహిళల నుంచి తిరుగుబాటు ఎలా ఉంటుందో రుచి చూపిస్తామంటూ ఆమె హెచ్చరించారు.