హైదరాబాద్: తాను పార్టీ మారుతున్నట్లు చెలరేగిన ఊహాగానాలపై తెలంగాణ కాంగ్రెసు నేత, ప్రముఖ సినీ నటి విజయశాంతి స్పష్టత ఇచ్చారు. తాను కాంగ్రెసు పార్టీలోనే కొనసాగుతానని ఆమె మీడియా ప్రతినిధులతో చెప్పారు. 

అదే సమయంలో కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడడానికి టీఆర్ఎస్ ప్రబుత్వం సిద్ధమవుతోందని ఆమె విమర్శించారు. వార్డుల విభజనలో అవకతవకలపై హైకోర్టు చేసిన వ్యాఖ్యల ద్వారా కేసీఆర్ ప్రభుత్వం బరితెగింపు బట్టబయలు అయిందని ఆమె అన్నారు. 

విజయశాంతి బిజెపిలో చేరుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెసుతో విసిగిపోయిన ఆమె పార్టీ మారేందుకు సిద్ధపడినట్లు ప్రచారం జరిగింది. ఆ వార్తలను విజయశాంతి కొట్టిపారేశారు. 

ఇదిలావుంటే, విజయశాంతి తిరిగి వెండితెరపై కనిపించనున్నారు. ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఆమె కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. లేడీ అమితాబ్ గా ఆమెకు పేరుంది. తెలంగాణ రాములమ్మగా కూడా ఆమెను పిలుచుకుంటారు.