ఖమ్మం లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ మహిళా నేత విజయశాంతి పోటీచేయనున్నారా? అవుననే సమాధానమే వినపడుతోంది. ఆమె ఖ్మం నుంచి పోటీ చేస్తే పూర్తి మద్దతు ఇస్తామని ఆ పార్టీ అధికార ప్రతినిధి మానవతారాయ్ తెలిపారు. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ నటిగా, తెలంగాణ ఉద్యమకారిణిగా విజయశాంతికి మంచి గుర్తింపు ఉందని ఆయన అన్నారు.

ఖమ్మం నుంచి చాలాసార్లు వలస నేతలు విజయం సాధించారని ఈ సందర్బంగా గుర్తు చేశారు. రాహుల్‌ గాంధీ ప్రధాని కావడం కోసం, విజయశాంతి గెలుపు కోసం తాను కృషిచేస్తానని పేర్కొన్నారు.వచ్చే ఎన్నికల్లో వరంగల్‌ లోక్‌సభ స్థానాన్ని తనకు కేటాయించాలని రాహుల్‌ గాంధీని కోరాతానని ఆయన తెలిపారు. 

కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌ ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖమ్మం లోక్‌సభ స్థానాన్ని ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. కాంగ్రెస్‌లో కీలక నేతగా వ్యవహరిస్తున్న విజయశాంతి గతంలో మెదక్‌ లోక్‌సభ నుంచి ఎన్నికయ్యారు.